రేపే రైతు భరోసా ప్రారంభం..మోదీ వస్తున్నట్టా? రానట్టా?

Update: 2019-10-14 18:20 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో కీలకమైన రైతు భరోసా రేపటి నుంచి ప్రారంభం కానుంది. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ప్రారంభోత్సవాన్ని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని విక్రమ సింహ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న బహిరంగ సభలో ఘనంగా చేపట్టనున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదంతా బాగానే ఉన్నా... మొన్న జగన్ ఢిల్లీ వెళ్లే సందర్భంగా.. రైతు భరోసా నిధుల్లో సగం నిధులు కేంద్ర ప్రభుత్వానివే ఉన్న నేపథ్యంలో ఈ పథకానికి వైఎస్ ఆర్ పేరుతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా చేరుస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా.

ఈ పథకం పేరుకు పీఎం పేరు కూడా యాడ్ చేస్తున్నామని - ఈ నేపథ్యంలో పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని జగన్ కోరారు. దీనికి మోదీ ఎలా స్పందించారో తెలియదు గానీ... పథకం పేరు మాత్రం వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ సమ్మాన్ గా మారిపోయింది. దీంతో ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తున్నట్టేనన్న వాదన కూడా వినిపించింది. నిజమే మరి... కేంద్రం నిధులు తీసుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పథకాలన్నీ తమకు చెందినవిగానే ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో జగన్... తన మదిలో మెదిలిన పథకానికి పీఎం పేరును కూడా యాడ్ చేసేందుకు సిద్ధపడితే... ఈ పథకం ప్రారంభోత్సవానికి మోదీ ప్రదాని హోదాలో హాజరై తీరాలి కదా. ఈ లెక్కన రేపు నెల్లూరులో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పథకం ప్రారంభోత్సవానికి మోదీ వస్తున్నట్లే కదా.

మరి అటు కేంద్రం నుంచి గానీ - ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదే? నిజమే... ఈ దిశగా ఓ ప్రకటన రాకపోగా... ఏర్పాట్లలోనూ మోదీ వస్తున్న దాఖలా కనిపించలేదు. మరి ప్రధాని మోదీ రాకుంటే... జగన్ ఈ పథకానికి పీఎం కిసాన్ సమ్మాన్ అనే పేరును ఎందుకు తగిలించినట్లు? ఏమో మరి అప్పుడెప్పుడో విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ... ఎవరికీ చెప్పాపెట్టకుండా పాక్ లో ల్యాండైన విషయం గుర్తుంది కదా. నాడు అటు నుంచి అటే పాక్ లో ల్యాండైన మోదీ... నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట జరిగిన వేడుకకు హాజరయ్యారు కదా. నాటి మాదిరే రేపు కూడా జగన్ రైతు భరోసా ప్రారంభవోత్సవ కార్యక్రమానికి వాలిపోతారేమో చూడాలి.


Tags:    

Similar News