మోడీతో ఫ్రెండ్ షిప్పా.. ఇలానే ఉంటుంది మ‌రి!

Update: 2018-06-20 04:45 GMT
ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా మిత్రులు వెళ్లిపోతున్న వేళ‌.. ఉన్నవారిని నిలుపుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ.. ప్ర‌ధాని మోడీ మాత్రం అందుకు భిన్నం. కొత్త మిత్రుల కోసం ఓప‌క్క ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే.. మ‌రోవైపు ఉన్న మిత్రుడ్ని అవ‌మాన‌క‌రంగా క‌టీఫ్ చెప్ప‌టం మోడీకి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే అంశంగా చెబుతున్నారు.

క‌శ్మీర్ లోని ముఫ్తీ స‌ర్కారుకు మోడీ ప‌రివారం క‌టీఫ్ చెప్ప‌టం పాత వార్త‌. కానీ.. ఏలా క‌టీఫ్ చెప్పారు?  క‌శ్మీరులో సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటుపై మోడీ గ‌తంలో మాట్లాడుతూ.. ఇదో చారిత్ర‌క సంద‌ర్భం అంటూ త‌మ స్నేహానికి అదిరిపోయే మాట‌ల‌తో క‌ల‌రిచ్చిన పెద్ద‌మ‌నిషి.. తీరా క‌టీఫ్ చెప్పే విష‌యంలో మ‌రీ ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల వేళ‌.. జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముప్తీ స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో సీఎంగా మాట్లాడించాలంటూ గ‌వ‌ర్న‌ర్ ఎన్ ఎన్ వోహ్రా నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో.. వెంట‌నే ఆయ‌న ముఖ్య‌మంత్రి మెహ‌బూబాకు ఫోన్ అందించారు.

ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ వోహ్రా మాట్లాడుతూ.. మీకు బీజేపీ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ర‌వీంద‌ర్ రైనా లేఖ రాశారు. బీజేపీ మంత్రులు రాజీనామా లేఖ‌ను ఇచ్చేశారన్నారు.

త‌న చుట్టూ ఇంత జ‌రుగుతున్నా ఏమీ తెలీకుండా స‌మీక్ష నిర్వ‌హిస్తున్న మెహ‌బూబా ఒక్క‌క్ష‌ణం షాక్ తిన్నారు. కాసేపు మౌనంగా ఉన్నారు. కాస్త తేరుకొని.. తాను కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి.. సాయంత్రానికి రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు.

స్నేహంలో క‌టీఫ్ లు ఉండ‌వ‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కానీ.. దానికి ఓ ప‌ద్ద‌తి ఉంటుందిగా. మాట వ‌ర‌స‌కైనా చెప్ప‌కుండా  మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ముఖం మీద గుద్దిన చందంగా ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా చెప్ప‌టం స‌రికాద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మోడీతో స్నేహ‌బంధం ఎలా ఉంటుంద‌న‌టానికి తాజా ఉదంతం చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. కొత్త స్నేహాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. పాత స్నేహితుల‌కు ఈ త‌ర‌హా షాకులిస్తారా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వ‌స్తోంది.


Tags:    

Similar News