డ్యామేజ్ అయిన ప్రతిసారీ మోడీ ఇమేజ్ భలే పెంచుతారే?

Update: 2019-11-28 14:30 GMT
సైకిల్ మీద వెళ్లి పని చేసుకొచ్చా. పర్యావరణానికి మేలు చేయటమే కాదు.. పది పైసలు కూడా ఖర్చు కాలేదన్న మాట విన్నంతే.. మా బాబే.. బంగారం. ఎంత పొదుపు? అనుకోకుండా ఉండలేం. అయితే.. బైక్ మీద వెళ్లి వచ్చి ఉంటే గంటలో అయ్యే పనికి సైకిల్ మీద వెళ్లిన కారణంగా రోజు మొత్తం పట్టిందన్న వాస్తవం తెలిస్తే ఏమనిపిస్తుంది? ప్రధాని మోడీ ఇమేజ్ పెంచేందుకు అమిత్ షా కానీ బీజేపీ వర్గాలు కానీ పడే ఆయాసం అంతా ఇంతా కాదు.

ఏదైనా ఇష్యూలో డ్యామేజ్ అయిన వెంటనే మోడీ పొదుపు.. నిజాయితీ.. ఆయన పాలనా సామర్థ్యం గురించి కథలు కథలుగా చెప్పటం మామూలే. విలువలకు పెద్దపీట వేసే అలవాటే మోడీకి ఉండి ఉంటే.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అలాంటి పని చేస్తారా? అన్నది ప్రశ్న. అధికారం చేజిక్కించుకోవటం కోసం దేనికైనా సరే అన్నట్లుగా వ్యవహరించే మోడీకి.. నీతి బోధనలు చేసేందుకు అవకాశం ఉండదు.

మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీషాల ప్లానింగ్ ను పలువురు తప్పు పడుతున్నారు. తమ ఇమేజ్ కు జరిగిన డ్యామేజ్ ను గుర్తించిన అమిత్ షా.. ఎప్పటిలానే మోడీ మాష్టారిలో మాత్రమే కనిపించేట్లుగా చెప్పే కొన్ని కోణాల్ని బయటపెట్టారు.

విదేశీ ప్రయాణాల సమయంలో అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవటానికి ప్రధాని మోడీ ఎప్పుడూ వెనుకాడరని.. విమానం ఆగిన సమయంలో హోటల్ కు వెళ్లకుండా ఎయిర్ పోర్టు టర్మినల్స్ లోనే రెస్టు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా కానీ ప్రజాజీవితంలోనూ మోడీ క్రమశిక్షణతో ఉంటారన్నారు.

ఫారిన్ టూర్లకు వెళ్లే సమయంలో తనతో 20 వాతం కంటే తక్కువ మంది సిబ్బందిని మాత్రమే తీసుకెళతారని.. గతంలో ఒక్కొక్కరు ఒక్కో కారు వాడేవారని.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఒకే బస్సులో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. హోదాను ప్రదర్శించుకోవటానికి ప్రధాని మోడీ ఇష్టపడరంటూ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇదంతా నిజమేనని అనుకుందాం. మోడీ ఇంత ఆదా చేస్తున్నారనే అనుకుందాం? దాని వల్ల కలిగే ప్రయోజనం ఎంత? అలా అని విచ్చలవిడిగా ఖర్చులకు అనుకూలమని చెప్పటం లేదు. మోడీ లాంటి వ్యక్తి సరైన రీతిలో విశ్రాంతి తీసుకోకపోతే దాని వల్ల కలిగే నష్టం మాటేమిటి? ఖర్చుల్ని తగ్గిస్తున్నట్లు గొప్పలు చెబుతున్న షా.. దాని కంటే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే దాని మీద ఫోకస్ పెడితే మంచిది కదా? మోడీ మిగిల్చే పైసా.. మిగిలిన కారణాల వల్ల పోయే పావలాకు ఏ మాత్రం సరిపోదున్న విషయాన్ని మర్చిపోకూడదు కదా?


- VS Rao
Tags:    

Similar News