కేంద్ర మంత్రికి నీరసం తెప్పించిన తెలంగాణ ఎంపీ

Update: 2016-07-28 10:31 GMT
లోక్ సభలో ఈ రోజు సరదా సంభాషణ సాగింది. తెలంగాణ ఎంపీ - కేంద్ర మంత్రి మధ్య సాగిన ఈ సంభాషణ అందరికీ నవ్వు తెప్పించింది. సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో దేశంలోని నీటి సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు  కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. అయితే.. అదే సందర్భంలో టీఆరెస్ ఎంపీ ఒకరు  ‘మిషన్ భగీరథ’ కు అదనపు నిధులు కావాలని కోరారు. ఆయన ఈ విషయంపై  మాట్లాడుతున్న సమయంలో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొంత అస్వస్థతతో ఉన్నట్లు కనిపించారు. దీంతో - మంత్రి గారు హుషారుగా లేరంటూ తెలంగాణ ఎంపీ అన్నారు. అందుకు మంత్రి ఇచ్చిన సమాధానం వినగానే అంతా ఒక్కసారి పగలబడి నవ్వారు.

మంత్రిగారు ఏమీ హుషారుగా లేరు.. ఎందుకో డల్ గా కనిపిస్తున్నారు అని ఎంపీ అనగానే తోమార్ స్పందించి.. ‘‘మీరు నిధులు అడుగుతున్నారు కదా.. డబ్బులు అడిగితే నేను  డల్ అయిపోతాను’’ అన్నారు. దీంతో లోక్ సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. కాసేపు ఆ సరదా సంభాషణ కొనసాగింది. ఆ తరువాత మంత్రి మళ్లీ మామూలై సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం కొందరు ఎంపీలు టీఆరెస్ ఎంపీల వద్దకు వచ్చి మంత్రిగారికి నీరసం తెప్పించన ఘనత మీదే అంటూ సరదాగా సెటైర్లు వేశారు.

అంతకుముందు ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ జరిగింది.  ఎంపీ పి.కరుణాకరణ్ ఈ చర్చను ప్రారంభించారు. పప్పుల ధరలు ఆకాసానికి ఎగసాయని ఆయన అన్నారు. బ్లాక్ మార్కెటీర్ల వల్లనే ధరలు పెరిగాయని ఆరోపించారు. అంతే కాకుండా ముడి చమురు ధరలు తగ్గినా ఆ ప్రయోజనం - లబ్ధి ప్రభుత్వం వినియోగదారులకు లభించడం లేదని కరుణాకరణ్ అన్నారు. అనంతరం సభ వాయిదా పడింది.
Tags:    

Similar News