గ్రౌండ్ రిపోర్ట్: నర్సాపురంలో గెలుపెవరిది?

Update: 2019-03-21 09:51 GMT
పార్లమెంట్ నియోజకవర్గం : నర్సాపురం
టీడీపీ :  వేటుకూరి శివరామరాజు
వైసీపీ : రఘురామకృష్ణం రాజు
జనసేన : నాగేంద్ర బాబు

నర్సాపురం.. రాజుల కోటగా ఈ నియోజకవర్గానికి పేరు పొందింది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ స్థానం ఎవరికి ఇచ్చినా కానీ.. నర్సాపురం వచ్చేసారికి క్షత్రియ సామాజికవర్గమైన ‘రాజు’లకే ఈ సీటును రాజకీయ పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అనూహ్యంగా పరిస్థితి మారింది. జనసేనాని పవన్ తన అన్నయ్య నాగబాబును నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపాడు. ఇద్దరు క్షత్రియుల మధ్య, కాపు సామాజికవర్గ నాగబాబు బరిలో ఉన్నారు. దీంతో నర్సాపురంలో ఇన్నాళ్లు ద్విముఖ పోరు కాస్తా.. ఇప్పుడు త్రిముఖ పోరుగా మారింది.

*నర్సాపురం చరిత్ర
2014 ఎన్నికల్లో పొత్తులో  భాగంగా ఈ నర్సాపురం ఎంపీ సీటును బీజేపీకి టీడీపీ వదిలేసింది. ఇక్కడ టీడీపీ ప్రాబల్యం అధికంగా వీచి బీజేపీ తరుఫున నిలబడ్డ గోకరాజు గంగరాజు ఈజీగా గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీ-బీజేపీ విభేదాలతో ఈసారి బీజేపీ ఉనికే ఈ నియోజకవర్గంలో కోల్పోయింది. హోదాపై మోసంతో బీజేపీ నిలబడ్డా డిపాజిట్ దక్కే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదు. దీంతో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు జనసేన తరుఫున నాగబాబు బరిలో ఉండడంతో పోటీ ముగ్గురి మధ్య నెలకొంది.

*టీడీపీ అభ్యర్థి నిలబడేనా?
టీడీపీ తరుఫున పోటీచేయాల్సిన రఘురామకృష్ణం రాజు చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఆపార్టీ తరుఫున ఇదే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీలో నిలబడ్డారు. దీంతో చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా అదే క్షత్రియవర్గానికి చెందిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును అభ్యర్థిగా బరిలో దింపారు. కలవపూడి శివగా.. మంచి పేరు సంపాదించుకున్న ఈయన రఘురామకృష్ణం రాజుకు ధీటైన అభ్యర్థిగా కనపడుతున్నారు.. టీడీపీ అధికారంలో ఉండడంతో ఆపార్టీ కార్యకర్తలు, నేతల బలంతో ఆశావాహంగా ఉన్నారు. టీడీపీ, చంద్రబాబు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆశిస్తున్నారు.

*వైసీపీ అభ్యర్థి బలంగా..
టీడీపీ టికెట్ ను కాదని.. ఈసారి వైసీపీ వేవ్ తో ఆ పార్టీలోకి జంప్ చేసిన రఘురామకృష్ణం రాజు ప్రస్తుతం నర్సాపురంలోనే బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. క్షత్రియవర్గంలో మంచి ఇమేజ్, పాపులారిటీ ఈయన సొంతం. బలమైన నేతగా.. కార్యకర్తలు, నాయకుల బలం పుష్కలంగా ఉంది. ప్రజల సపోర్టు కూడా ఈయనే ఉంది. దీంతో టీడీపీ అభ్యర్థి శివరామరాజును ఈజీగా ఓడిస్తాడని వైసీపీ నమ్మకంగా ఉంది.

*నాగబాబు ఎంట్రీతో సీన్ రివర్స్
నాగబాబు నర్సాపురం ఎంపీగా ఎంట్రీ ఇవ్వకముందు వరకూ నర్సాపురంలో అయితే వైసీపీ లేదంటే టీడీపీ అన్న పోటీ ఉండేది.కానీ నాగబాబును పోటీకి దింపి పవన్ నర్సాపురంలో త్రిముఖ పోరు పెట్టారు. పవన్ పోటీచేసే భీమవరం నర్సాపురంలోనే ఉండడంతో అన్నయ్య గెలుపు భారం తమ్ముడిపైన పడింది. దీంతోపాటు నర్సాపురంలో పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు సామాజికవర్గం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. అంతేకాకుండా ఇదివరకు రెండు సార్లు కాపు నేతలు హరిరామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు ఇక్కడినుంచి ఎంపీగా గెలిచారు. దీంతో నాగబాబు ఆ సామాజికవర్గం ఓటర్లు ఐక్యంగా మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే  కాపులు నాగబాబు ఎంతవరకు ఏస్తారనేది కీలకంగా మారింది.  వైసీపీ, టీడీపీకి కాపులు చీలిపోతే  నాగబాబుకు చిక్కులు తప్పవు. అందుకే వ్యూహాత్మకంగానే నర్సాపురం సీటులో పవన్ తన అన్న నాగబాబును పోటీచేయించాడన్న ప్రచారం జరుగుతోంది.

*త్రిముఖ పోరులో ఎవరైనా గెలవచ్చు..
పవన్ పోటీచేసే భీమవరంతోపాటు ఉండి, తనుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు శాసించే స్థాయిలో ఉన్నారు. పైగా భీమవరం నుంచి పవన్..  మెగా ఫ్యామిలీ సొంతూరు  మొగల్తూరు నర్సాపురం నియోజకవర్గంలో ఉండడంతో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంది. కానీ  కాపులందరూ నాగబాబుకు వేస్తారన్నది డౌటే. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి స్థానికతను పట్టించుకోని నాగబాబు సడన్ గా వచ్చి పోటీపడితే స్థానికేతరుడన్న కారణం ఆయనకు మైనస్ గా మారింది. ఇదివరకు ప్రజారాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీపడితే ఓడిపోయారు. నాన్ లోకల్ అన్న ముద్ర నాగబాబుకు మైనస్ గా మారింది. దీంతో నాగబాబుకు గంపగుత్తగా కాపు ఓట్లు పడే చాన్సులు అయితే లేవు. ఇక కాపులు కాకుండా మిగతా వర్గాల ఓట్లు వైసీపీ, టీడీపీకే పడే అవకాశాలున్నాయి. కాపులు కూడా ఇటువైపు తిరిగితే ఇద్దరూ బలమైన అభ్యర్థులుగా మిగులుతారు.  దీంతో ఈసారి నర్సాపురంలో ముగ్గురు బలమైన అభ్యర్థులున్న ఈ కీలకమైన స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందనేది చెప్పలేని విధంగా ఉంది.  
    

Tags:    

Similar News