కాసినీ మండిపోయింది!

Update: 2017-09-16 04:52 GMT
మనం నివసించే భూమికి ఎన్నో వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శని గ్రహాన్ని పరిశోధించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా.. 1997లో కాసినీ అనే ఉపగ్రహాన్నిపంపిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు రెండు దశాబ్దాలపాటు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ ఆ గ్రహం గురించి - సౌర వ్యవస్థ గురించి మనకు ఎంతో విలువైన సమాచారాన్నిఅందించిన సంగతి విదితమే. అయితే తాజాగా శని గ్రహంపైన ఉన్నవాతావరణ ఉష్ణోగ్రతకు ఇది మండిపోయిందని నాసా తెలిపింది. చివరి సిగ్నల్ ను నిన్నటి వరకు అందుకున్నామని చెప్పింది. భారమైన హృదయంతో దానికి వీడ్కోలు చెప్పినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాసినో గురించి కొన్ని వివరాలు  ..

27 దేశాలకు చెందిన శాస్తవ్రేత్తల సహకారంతో 3.9 బిలియన్ డాలర్లతో అంతర్జాతీయ ప్రాజెక్టుగా కాసిని ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. 7.9 బిలియన్ కిలోమీటర్ల దూరం మేర రోదసీ లోతుల్లోకి పయనించిన కాసినిలో ఇంధనం అయిపోవడంతో దానికి అంతిమ ఘడియలు దాపురించాయి. ఫలితంగా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన శనిగ్రహ వాతావరణంలోకి వెళ్లిపోయింది. ప్రపంచ రోదసీ పరిశోధకులకు ఈ వ్యోమనౌక చేసిన సేవ అంతా ఇంతా కాదట. శనిగ్రహానికి సంబంధించే కాకుండా దాని ఉపగ్రహాలైన ఎన్‌ సెలాడస్ వంటి చంద్ర గ్రహాలకు సంబంధించీ ఎన్నో అద్భుత ఛాయాచిత్రాల్ని అందించింది. ఇవన్నీ కూడా భవిష్యత్‌ లో రోదసీ పరిశోధనల్నిమరింత విస్తృతంగా చేయడానికి ఎంతగానో ఉపకరించేవే.

నిజానికి ఈ వ్యోమనౌక అంతిమ ప్రయాణం ఏప్రిల్‌లోనే మొదలైందని, శనిగ్రహం - దాని మధ్య ఉండే వలయాల మధ్య సాగిందని నాసా వివరించింది. ఇప్పటి వరకూ శనిగ్రహానికి ఇంత చేరువగా వెళ్లిన వ్యోమనౌకే లేదని, ఈ మిషన్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని కాసిని మిషన్ మేనేజర్ ఎర్ల్ మైజ్ తెలిపారు. శనిగ్రహ వాతావరణంలో ఓ ఉల్క మాదిరిగా దగ్ధంమయ్యే క్షణం వరకూ ఈ వ్యోమనౌక సంకేతాలు అందిస్తూనే ఉందన్నారు. గంటకు 113,000 కిలోమీటర్ల వేగంతో ఇది శనిగ్రహ వాతావరణంలోకి ప్రవేశించిందని, ఈ గ్రహ ఉపరితలానికి 1,500 కిలోమీటర్ల ఎత్తులోకి కాసిని వెళ్లిన క్షణంలోనే భూమితో సంబంధాలు తెగిపోయాయన్నారు. ఇది జరిగిన 30 సెకన్లలోనే ఇది ముక్కలైందని, అది జరిగిన కొన్ని నిముషాల వ్యవధిలో దీని భాగాలన్నీ శనిగ్రహ వాతావరణ ఉష్ణోగ్రతకు ఆహుతైపోయాయని నాసా వివరించింది.

Full View
Tags:    

Similar News