గ్రేట్‌: ప్లానెట్ -9 వివ‌రాలు తెలిసిపోయాయ్‌

Update: 2017-10-14 13:03 GMT
`సూప‌ర్ ఎర్త్`- కొన్ని ద‌శాబ్దాలుగా ఖ‌గోళ శాస్తంలో ఈ పేరు మ‌న‌కు వినిపిస్తూనే ఉంది. అంత‌రిక్షంలోనే కొన్ని లక్ష‌ల న‌క్ష‌త్రాలు వేలాది గ్ర‌హ రాశుల మ‌ధ్య అత్యంత కీల‌క‌మైన సూప‌ర్ ఎర్త్ దాగి ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. ఎన్నో కోట్ల రూపాయ‌లు ధార పోసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లోనే శాస్త్ర‌వేత్త‌లు త‌మ జీవితాల‌ను సైతం వెళ్ల‌దీస్తున్నారు. అయినా కూడా ఈ సూప‌ర్ ఎర్త్.. ఒక గ్ర‌హం అని మాత్ర‌మే నిన్న‌టి వ‌రకు చెప్పుకొచ్చారు. అంత‌కు మించి ఎలాంటి విష‌యాలూ దీని గురించి ప్ర‌పంచానికి తెలియ‌రాలేదు. అయితే, తాజాగా జ‌రిగిన ప‌రిశోధ‌న‌లు ఈ సూప‌ర్ ఎర్త్ గురించి అన్ని విష‌యాల‌నూ వెల్ల‌డించేసింది.

ఈ విష‌యాల‌ను తాజాగా శాస్త్ర‌వేత్త‌లు ప్రపంచానికి అందించారు. ఈ విష‌యాలు చాలా ఆస‌క్తిగా ఉన్నాయి. ప్లానెట్‌–9 గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహం బరువు భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంద‌ని తెలిసింది.  సూర్యుడి నుంచి చాలా దూరంలో ఉన్న‌ నెప్ట్యూన్‌ కంటే 20 రెట్లు దూరంలోనూ ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. కనిపించకుండా దోబూచులాడుతున్న ఈ ప్లానెట్‌–9 గ్రహాన్ని కనపించని ఓ సూపర్‌ ఎర్త్‌గా శాస్త్రవేత్తలు కొన్ని ద‌శాబ్దాల కింద‌టే అభివర్ణించారు. అంతేకాదు, దీనివ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు కూడా ఉన్నాయ‌ని చెబుతూ వ‌చ్చారు.

అయితే బరువులో భూమి కంటే బ‌రువున్న‌ప్ప‌టికీ..  మంచు గ్రహాలైన యూరేనస్ - నెప్ట్యూన్‌ కంటే ప్లానెట్‌–9 గ్రహం బరువు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహ ఉనికికి సంబంధించి ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని, అయితే ప్రస్తుతం ఆ గ్రహ ఉనికిని తెలిపే 5 పరిశీలనాత్మక ఆధారాలు లభించాయని అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్లానెటరీ ఆస్ట్రోఫిజియిస్ట్‌ కాన్‌స్టాంటిన్‌ బాజిన్‌ వివరించారు. ప్ర‌స్తుతం త‌మ ప‌రిశోధ‌న‌లు ఇంకా ముందుకు వెళ్లేందుకు తాజాగా క‌నుగొన్న ఫ‌లితాలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఏదేమైనా.. ఎప్ప‌టినుంచో శాస్త్ర‌వేత్త‌ల‌కు మింగుడు ప‌డ‌ని సూప‌ర్ ఎర్త్ గురించి వివ‌రాలు తెలియ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు పండ‌గ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News