శ్రీ‌లంక ఎందుకంత‌గా ర‌గిలిపోతోంది?

Update: 2018-03-07 04:59 GMT
ఎల్టీటీఈ ఇష్యూ త‌ర్వాత అక్క‌డ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు సంబంధించిన చ‌ర్చ జ‌రిగింది లేదు. అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లుగా కూడా పెద్ద‌గా వార్త‌లు రిపోర్ట్ కాలేదు. ఉన్నంత‌వ‌ర‌కూ పెద్ద ఇబ్బందులు లేకుండానే సాఫీగా బండి న‌డుస్తున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. భార‌త‌.. శ్రీ‌లంక‌.. బంగ్లాదేశ్ మ‌ధ్య టీ20 సిరీస్ క్రికెట్ పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్సాహంగా అంద‌రూ సిరీస్ ఫ‌లితం ఎలా ఉంటుంద‌ని ఎదురుచూస్తున్న వేళ‌.. షాకింగ్ గా శ్రీ‌లంక‌లో ఎమ‌ర్జెన్సీ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

అంతేకాదు.. శ్రీ‌లంలో మ‌త‌క‌ల‌హాలు చెల‌రేగిన‌ట్లుగా.. ఇద్ద‌రు మృతి చెందిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం షాకింగ్ గా మారింది. ఆ దేశంలో ప‌లు మ‌సీదులు.. ఇళ్లు.. ముస్లింల వాహ‌నాలు ద‌హ‌నం కావ‌ట‌మే కాదు.. ఈ ఘ‌ర్ష‌ణ‌లు అంత‌కంత‌కూ పెరిగి.. దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్నాయ‌న్న వార్త‌లు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఘ‌ర్ష‌ణ‌లు వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు దేశాధ్య‌క్షుడు.. దేశ వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీని విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దేశాధ్యోఉడు మైత్రిపాల సిరిసేన అత్య‌వ‌స‌రంగా మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హించి.. ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఇంత వ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న శ్రీ‌లంక‌లో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు ఎందుకు మొద‌ల‌య్యాయి?  అవి కాస్తా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించే వ‌ర‌కూ ఎందుకు వెళ్లింది? అన్న‌ది ప్ర‌శ్న‌లుగా మారాయి. గ్రౌండ్ రిపోర్టులోకి వెళితే.. శ్రీ‌లంక‌లో ప‌ర్యాట‌క ప్రాంత‌మైన థెల్దినియాలో వారం క్రితం ఒక అల్ల‌రిమూక చేతిలో ఒక బౌద్ధుడు మ‌ర‌ణించాడు. బౌద్ద మ‌తానికి చెందిన వ్య‌క్తి మ‌ర‌ణించింది ముస్లిం వ్య‌క్తి చేతిలో అన్న వార్త దావ‌నంలా మారింది. ప్రాథ‌మికంగా ఇదే తాజా ప‌రిస్థితికి కార‌ణంగా చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన క్యాండీ జిల్లాలో బౌద్దులు మెజార్టీలు కాగా.. ముస్లింలు మైనార్టీలు.

విప‌రీత‌మైన ఆవేశానికి గురైన బౌద్దులు.. వాహ‌నాలు.. ఇళ్ల‌ను ద‌గ్థం చేయ‌టంతో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి పూర్తిగా క్షీణించ‌ట‌మే కాదు.. ప‌రిస్థితి అదుపు త‌ప్పే ప‌రిస్థితి. దీంతో.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. బౌద్ధ సింహ‌ళుల దాడిలో మైనార్టీల‌కు చెందిన 10 మ‌సీదులు.. 75 షాపులు.. 32 ఇళ్లు ధ్వంస‌మైన‌ట్లుగా స‌మాచారం. శ్రీ‌లంక‌లో 2011 త‌ర్వాత అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించ‌టం ఇదే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం. దేశ రాజ‌ధాని కొలంబోలో ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉంద‌ని చెబుత‌న్నారు.

శ్రీ‌లంక‌లో బౌద్ధులు.. ముస్లింల మ‌ధ్య మ‌త క‌ల్లోలాల‌కు దాదాపు వందేళ్ల చ‌రిత్ర ఉంద‌ని చెబుతారు. కాండీ న‌గ‌రం సింహ‌ళ బౌద్ధుల‌కు పుణ్య‌స్థ‌లంగా చెబుతారు. ఎందుకంటే..ఇక్కడ బుద్ధుడి ప‌న్నుతో పాటు.. వెంట్రుక‌లు ఉన్నాయి. వాటిని ప‌ర‌మ ప‌విత్రంగా కొలుస్తుంటారు. ఓ పెద్ద దేవాల‌య‌మే ఉంది. శ్రీ‌లంక‌లో 2.10కోట్ల జ‌నాభా ఉండ‌గా.. 70 శాతానికి పైగా సింహ‌ళ బౌద్ధులు ఉండ‌గా.. ముస్లింల సంఖ్య ప‌దిశాతం మాత్ర‌మే. తొలిసారి శ్రీ‌లంక‌లో మ‌త‌క‌ల్లోలం 1915లో జ‌రిగిన‌ట్లు చెబుతారు. ఐరోపా వ‌ల‌స‌పాల‌కుల చేతిలో ఉన్న శ్రీ‌లంక 1948లో స్వాతంత్య్రం సాధించుకుంది. మొద‌ట్నించి సింహ‌ళ బౌద్ధుల అధిప‌త్యం ఆ దేశంలో అధికం. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత రాజ్యాంగంలో బౌద్ధ ధ‌ర్మానికి ప్ర‌త్యేక స్థానం క‌ల్పించారు.

తాజా ప‌రిస్థికి కార‌ణం బౌద్ధ తీవ్ర‌వాద సంస్థ బోడు బాల‌సేన‌గా చెబుతారు. కాండీ న‌గ‌రంలో ఈ సంస్థ ముస్లిం వ్య‌తిరేక ప్ర‌చారంతో ఇలాంటి ప‌రస్థితికి కార‌ణంగా చెబుతున్నారు. బాల‌సేన చేస్తున్న ముస్లిం వ్య‌తిరేక ప్ర‌చారం కార‌ణంగా 2014లో దేశ నైరుతి భాగంలో బౌద్ధుల‌కు.. ముస్లింల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. మ‌య‌న్మారు నుంచి శ్రీ‌లంక‌కు శ‌ర‌ణార్థులుగా వ‌చ్చిన రోహింగ్యా ముస్లింల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌టాన్ని బాల‌సేన వ్య‌తిరేకిస్తోంది.

దేశంలో సింహ‌ళ జాతిని.. బౌద్ధ ధ‌ర్మాన్ని కాప‌డ‌ట‌మే లక్ష్యంగా బాల‌సేన ప్ర‌చారం చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. శ్రీ‌లంక‌లోని ముస్లింలు కొత్త‌గా బుర‌ఖా సంస్కృతిని తీసుకొస్తున్నారు. కొత్త సంప్ర‌దాయంగా వారు బుర‌ఖాను ధ‌రిస్తున్నారు. దీన్ని బాల‌సేన తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. శ్రీ‌లంక‌కు చెందిన ముస్లింల్లో ఎక్కువ‌మంది ప‌శ్చిమాసియా దేశాల్లో ప‌ని చేస్తున్న కార‌ణంగా వారి ఆదాయం పెర‌గ‌టం.. గ‌తంలో లేని విధంగా ముస్లింల‌లో వేష‌ధార‌ణ విష‌యంలో చోటు చేసుకుంటున్న మార్పులు బాల‌సేన లాంటి సంస్థ‌లు వ్య‌తిరేకిస్తున్నాయి. దీంతో.. త‌ర‌చూ గొడ‌వ‌లు చెల‌రేగుతున్నాయి.
Tags:    

Similar News