నోటి దూల నేషనల్ హెరాల్డ్ నేలకు దిగి వచ్చింది

Update: 2019-11-11 08:55 GMT
ఒకసారి తప్పు చేస్తే పొరపాటుగా ఫీలై ఓకే అనుకోవచ్చు. కానీ.. అదే పనిగా తప్పులు చేసే వారిని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ తీరు కూడా ఇదే రీతిలో ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన పత్రిక నేషనల్ హెరాల్డ్ చేసిన పిచ్చ పనిపై నెటిజన్లు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టాండ్ కు భిన్నంగా వ్యవహరించిన ఆ పత్రిక.. అయోధ్యపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై వివాదాస్పద రీతిలో రియాక్ట్ అయిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయోధ్యలో హిందువులు ఎప్పుడూ పూజలు చేయలేరన్న శీర్షికతో నేషనల్ హెరాల్డ్ ప్రచురించిన ఎడిటోరియల్ పెను దుమారానికి కారణమైంది. కర్ర ఎవరి చేతిలో ఉంటే వారిదే ఎద్దు అన్నట్లుగా రాసుకు రావటమే కాదు.. ఒత్తిడి.. హింస.. రక్తపాతంతో నిర్మించిన గుడిలో దేవుడు ఉంటాడా? ఇలాంటి చోట ఎవరైనా పూజలు చేస్తారా? అని రాసుకొచ్చింది. ఎప్పుడైతే ఆచితూచి వ్యవహరించాలో అదే సమయంలో ఇష్టారాజ్యంగా రాయటం.. సంయమనం కోల్పోయినట్లుగా ఉన్న రాతలు పలువురికి మంట మండేలా చేశాయి.

ఈ ఎడిటోరియల్ చూసిన పలువురు.. ఇది పాకిస్థాన్ నిధులతో నడిచే మీడియా సంస్థగా పలువురు మండిపడ్డారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రక తీర్పును అవమానించేలా ఉందని.. నేషనల్ హెరాల్డ్ యాజమాన్యాన్ని శిక్షించాలని కొందరు వ్యాఖ్యానించారు.

తమ ఎడిటోరియల్ పై తీవ్ర దుమారం రేగి.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. సదరు మీడియా సంస్థ కిందికి దిగింది. ఆర్టికల్ కు సంబంధించిన ఉద్దేశాలు సదరు రచయిత వ్యక్తిగతంగా పేర్కొంది. సున్నితమైన సమయాల్లో ఒక వ్యక్తికున్న ఆక్రోశాన్ని పత్రిక ఆక్రోశంగా ఎలా వ్యక్తం చేస్తారన్న ప్రశ్న ఎదురవుతోంది. అయినా.. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ సుప్రీం తీర్పును స్వాగతించటంతో పాటు.. రామాలయ నిర్మాణానికి మద్దతు తెలిపిన వేళ.. ఆ పార్టీ పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్ మాత్రం తమ లైన్ కు భిన్నంగా ఎడిటోరియల్ రాయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. తన పార్టీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దని ఆదేశించిన రాహుల్.. ప్రియాంకలు.. తమ పత్రికకు ఆ మాటను చెప్పలేదా? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News