జాతీయ పార్టీ : చప్ప చప్పగా.. ఫుల్ సైలెంట్ గా...

Update: 2022-10-06 09:30 GMT
దేశంలో ఒక కొత్త పార్టీ వస్తుందంటే కనీసమైన ఉత్సహాం ఉత్సుకత ఎవరిలోనైనా  ఉంటాయి. ఏమో ఎవరి మీద గురి పెట్టనుందో, ఆ రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో ఏంటో అన్న లెక్కలు బోలెడు తీసేవారుంటారు. ఇవన్నీ పక్కన పెడితే విశ్లేషణలు అయినా మంచికో చెడ్డకో చేస్తారు. కొత్త పార్టీ రావచ్చు, రాకూడదు అన్న చర్చ కూడా ఎక్కడో ఒక చోట పెడతారు. పొలిటికల్ క్రిటిక్స్ అయితే ఇలాంటి వాటి కోసం కాచుకుని కూర్చుంటారు.

కానీ హైదరాబాద్ లో విజయదశమి రోజున కేసీయార్ పార్టీ పెడితే అంతా కూడబలుక్కున్నట్లుగా  గప్ చుప్ అయ్యారు. కనీసం రాజకీయపరమైన విమర్శలు కూడా పెద్దగా రాలేదు, జాతీయ్ పార్టీ కొత్తది   అవసరమే అని ఎటూ సమర్ధించే వారు ఉండరనుకోవచ్చు. కానీ పార్టీ అవసరమా ఈ టైమ్ లో అని పెదవి విరిచిన వారూ  లేరు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే భారత్ రాష్ట్ర సమితి అన్న పార్టీ ప్రకటన చప్పచప్పగానే సాగిపోయింది.

విజయదశమి మంచి రోజు అని కేసీయార్ ముహూర్తం పెట్టుకుని అనౌన్స్ చేసి ఉండవచ్చు కానీ అదే మంచి రోజున దేశమంతా పండుగ హడావుడితో ఉంది. అయినా సరే నిలువెల్లా తమలో రాజకీయం నింపుకున్న  నాయకులు  ఉంటారు కదా. వారు అయినా ఈ దిక్కున చూసినట్లుగా లేదు అనుకోవాలి. ఇక కేసీయార్ జాతీయ పార్టీని పెట్టడానికి ముందు దేశమంతా తిరిగారు. చాలా మంది కీలక నాయకులను ఆయన కలిశారు.

అయినా సరే ఎక్కడా చడీ చప్పుడూ లేదంటే బీయారెస్ కి ఇది షాకింగ్ పరిణామమే అని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకానీ డీఎంకే స్టాలిన్ కానీ ఈ కొత్త పార్టీ మీద తాజా రాజకీయ పరిణామాల మీద నోరు విప్పలేదు.అలాగే అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ వంటి నేతలు కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు. వీరిని కేసీయార్ స్వయంగా కలిశారు, దేశ రాజకీయాల మీద మాటా మంతీ చేశారు.

ఇక ఆయన బీహార్ వెళ్లి అక్కడ  గాల్వన్ ఘర్షణలో అమరవీరులకు కేసీఆర్ నష్టపరిహారం పంపిణీ చేసినప్పటికీ వారు అయినా దీని మీద ఏ మాత్రం  కూడా స్పందించలేదు. పంజాబ్‌లో వ్యవసాయ ఆందోళనలో చనిపోయిన రైతులకు కేసీఆర్ పనిగట్టుకుని వెళ్ళి మరీ  ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేశారు. అయితే  పంజాబ్‌కు చెందిన ఏ నాయకుడూ కూడా వెల్ కమ్ కేసీయార్ అని ఎక్కడా మాట్లాడలేదు.  

సరే వారూ వీరూ ఎందుకు కేసీయార్ కి జిగినీ దోస్త్ అని అంతా చెప్పుకునే వైసీపీ అధినేత  వైఎస్ జగన్ నుంచి కూడా ఏ రకమైన అనుకూల స్పందన రాలేదు. పైగా ఏపీకి చెందిన మంత్రులు కొత్త పార్టీ తో బేఫికర్ అనేసి లైట్ తీసుకున్నారు. చంద్రబాబు అయితే ఎవరికీ అర్ధం కానీ ఒక నవ్వు నవ్వేసి మీడియా ప్రశ్నకు తన బదులు అన్నట్లుగా చెప్పేశారు.

ఇవన్నీ చూస్తూంటే కేసీయార్ పార్టీ మీద డప్పులన్నీ కూడా తెలంగాణాలో టీయారెస్ నాయకులే కొట్టుకుంటున్నారు తప్ప ఎవరూ కూడా అసలు ఖాతరు చేయడంలేదని అర్ధమవుతోంది. మరి నేషనల్ పార్టీకి బజ్ ఏ మాత్రం లేని వేళ ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది పెద్ద డౌట్. ఏది ఏమైనా కేసీయార్ రాజకీయ జూదమే ఆడుతున్నారు అన్నది రాజకీయమేంటో తెలిసిన వారి మాట. బహుశా అది తప్పు అని నిరూపించడానికి కేసీయార్ వేయి రెట్లు కష్టించాల్సి ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News