కేసీఆర్‌ కు ప‌ట్నాయ‌క్ కూడా దెబ్బేశారుగా!

Update: 2018-04-19 07:05 GMT
జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుదామంటూ అడుగు ముందుకేసిన టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయ‌నే చెప్పాలి. ప‌లు జాతీయ పార్టీల‌తో చ‌ర్చ‌లంటూ మొన్న‌టికి మొన్న ప‌శ్చిమ బెంగాల్ వెళ్లిన కేసీఆర్‌ కు ఆ రాష్ట్ర సీఎం - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి గ‌ట్టి దెబ్బే కొట్టార‌న్న వార్త‌లు వినిపించాయి. అస‌లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌మేయం లేకుండా తృతీయ ఫ్రంట్ ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని కూడా నాడు దీదీ చెప్పిన విష‌యం కాస్తంత ఆల‌స్యంగా వెలుగులోకి రావ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన కేసీఆర్‌.... అంత‌కుముందు నిర్ణ‌యించుకున్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోక త‌ప్ప‌లేద‌న్న వాద‌న కూడా వినిపించింది. అంతేకాకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు సంబంధించిన చ‌ర్చ‌ల కోసం కాకుండా కోల్‌ క‌తాలోని కాళీ మాత‌ను ద‌ర్శించుకునేందుకే అక్కడికి వెళ్లిన కేసీఆర్ ప‌నిలో ప‌నిగా మ‌మ‌త‌తో భేటీ అయిన‌ట్టుగా కూడా వార్త‌లు వినిపించాయి. ఇదే విష‌యాన్ని దీదీ కూడా స్వ‌యంగా చెప్ప‌డం నాడు పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యింది.

ఇక ఇటీవ‌ల కర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు వెళ్లిన కేసీఆర్‌... మాజీ ప్ర‌ధాని - జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌తిపాదించిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను పీపుల్స్ ఫ్రంట్ గా అభివ‌ర్ణించేసిన గౌడ‌... కేసీఆర్ కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే క‌న్న‌డ‌నాట జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా జేడీఎస్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ద‌రిమిలానే గౌడ నోట నుంచి ఆ మాట వినిపించింద‌ని కూడా తెలుస్తోంది. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా గౌడ‌తో భేటీ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్‌... క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీఎస్‌ కు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటుగా క‌ర్ణాట‌క‌లోని తెలుగు ప్ర‌జ‌లంతా జేడీఎస్‌ కే ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా జేడీఎస్‌ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌డంతోనే కేసీఆర్ ఫ్రంట్ కు గౌడ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌న్న విష‌యం తేలిపోయింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు బ‌లం చేకూర్చే క్ర‌మంలో ఇప్ప‌టిదాకా కేసీఆర్ క‌లిసిన ఇద్ద‌రు నేత‌లు కూడా ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ల ప‌ట్ల త‌మ‌దైన శైలిలో స్పందించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకున్న విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే నెల తొలి వారంలో బిజూ జ‌న‌తాద‌ళ్ అధినేత‌ - ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ వెళుతున్నార‌ని తెలంగాణ సీఎంఓ కార్యాల‌యం నుంచి స‌మాచారం లీకైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం లీకైందనే కంటే కూడా కేసీఆర్ మీడియా మేనేజ‌ర్లే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి చ‌ర్చించేందుకే కేసీఆర్ భువ‌నేశ్వ‌ర్ వెళుతున్నార‌ని కూడా వారు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌లో ఎంత‌మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు రాగా... కేసీఆర్ నిజంగానే బ్ల‌ఫ్ మాస్ట‌ర్ అయిపోయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా తాజా విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది వేరేవ‌రో కాదు... కేసీఆర్ క‌ల‌వాల‌నుకుంటున్న ప‌ట్నాయ‌కే ఈ విష‌యంపై నోరు విప్ప‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పూరీ జ‌గ‌న్నాథుడిని ద‌ర్శించుకునేందుకు వెళుతున్నాన‌ని, ఈ క్ర‌మంలో అటుగా వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌ను కూడా క‌లుస్తాన‌ని కేసీఆర్ నుంచి త‌న‌కు స‌మాచారం అందింద‌ని - ఓ రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ త‌న‌ను క‌లుస్తానంటే తానెందుకు వ‌ద్దంటానని కూడీ ప‌ట్నాయ‌క్ పేర్కొన్నారు.

ఈ ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ ఎందుకు అక్క‌డికి వెళుతున్నార‌న్న విష‌యం ఇప్పుడు నిజంగానే బ‌ట్ట‌బ‌య‌లైపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వెళుతున్న‌ది దైవ ద‌ర్శ‌నానికైన‌ప్పుడు ఆ విష‌యాన్ని దాచేసి... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి ప‌ట్నాయ‌క్‌ తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు తాను ఒడిశా ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నాన‌ని కేసీఆర్ చెప్ప‌డం చూస్తుంటే... కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొన్న కాళీ మాత ద‌ర్శ‌నానికి వెళ్లిన కేసీఆర్‌... ఆ ప‌ర్య‌ట‌న‌లో దీదీతో క‌లిసి భంగ‌ప‌డ్దారు. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి వెళుతూ ప‌ట్నాయ‌క్ వ‌ద్ద కూడా కేసీఆర్ ప‌లుచ‌నైపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా నాడు కేసీఆర్ కోల్ క‌తా నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డగా... ఇప్పుడు భువ‌నేశ్వ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌క‌ముందే త‌న ప‌ర్య‌ట‌న‌లోని గుట్టు వెలుగులోకి రావ‌డంతో కేసీఆర్ కు పెద్ద షాకే త‌గిలింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తంగా ఒక్క మాట‌తో ప‌ట్నాయ‌క్‌... కేసీఆర్‌ను బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌ను చేసేశార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News