మోడీకి దిమ్మ తిరిగే షాకిచ్చిన మాజీ క్రికెటర్

Update: 2016-07-19 04:37 GMT
తన ప్రత్యర్థులకు మోడీ ఎలాంటి షాకులిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అంతటా తానే అన్నట్లుగా విస్తరిస్తున్న మోడీ లాంటి బలమైన నేతకు షాక్ ఇవ్వాలంటే చాలానే ధైర్యం కావాలి. తెగింపు అంతకు మించి అవసరం. తాజాగా అలాంటి పరిణామమే ఒకటి చోటుచేసుకుంది. మోడీపై వార్ చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒకరిద్దరు అధినేతలు మినహా.. మిగిలినవారంతా కాస్త అటో ఇటో సర్దుకుపోయే వారే. అధినేతల పరిస్థితే అలా ఉంటే.. ఇక పార్టీలోని నేతల పరిస్థితి మరెంత పరిమితంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. అందుకు భిన్నంగా మాజీ క్రికెటర్.. ఇటీవలే రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన మాజీ క్రికెటర్ సిద్ధూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాజ్యసభకు ఎన్నిక చేసిన ముచ్చట తీరని వేళ.. ఏకంగా పదవికి రాజీనామా చేయటం ద్వారా మోడీకి షాకిచ్చారని చెప్పాలి. ఎందుకిలా అంటే.. దాని వెనుక పెద్ద కథే ఉందని చెబుతున్నారు.

సిద్ధూ వెనుక ఆమ్ఆద్మీ పార్టీ ఉండటమే తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా కసరత్తుచేస్తోంది. ఇందులో భాగంగా తమ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను బరిలోకి దించాలన్న నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.ఈ విషయాన్ని సిద్ధూకి అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. పంజాబ్ పార్టీ వ్యవహారాలు ఆయన చేతికి అప్పజెప్పాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం తనకు కట్టబెట్టిన రాజ్యసభ స్థానాన్ని వదులుకున్నట్లు చెబుతున్నారు. 2004 - 2009లలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సిద్ధూ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోసం పోటీ చేయకుండా తప్పుకున్నారు.

ఇందుకుగాను ఇటీవల ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. అయితే.. పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని తపిస్తున్న సిద్ధూకు.. ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు అండగా నిలుస్తానని చెప్పటం.. పంజాబ్ లో ఆ పార్టీకి మంచి పేరు ఉండటంతో.. బీజేపీకి షాకిచ్చేందుకు సిద్ధూ సిద్ధమయ్యారు. సిద్ధూ సతీమణి కౌర్ ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కూడా తన పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. సిద్ధూతో మోడీకి దిమ్మ తిరిగే షాకు ఇవ్వటంలో కేజ్రీవాల్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. బలమైన అధికారపక్షాన్ని వదిలేసి బయటకు వెళ్లటం ఇప్పుడున్న రాజకీయాల్లో కాస్త చిత్రమే. అందులోకి మోడీలాంటి వ్యక్తికి చెందిన పార్టీకి చెందిన నేత అంటే.. ఇదేమీ చిన్న విషయం కాదనే చెప్పాలి.
Tags:    

Similar News