పాక్.. బంగ్లాదేశ్ లను భారత్ లో కలపాలట

Update: 2020-11-23 14:00 GMT
సంఘ్ పరివార్ కు చెందిన పలువురు నేతలు..కార్యకర్తలు తమ మాటల మధ్యలో తరచూ ఒక ప్రస్తావన తీసుకొస్తారు. ఏనాటికైనా అఖండ్ భారత్ ను తిరిగి ఒక చోటకు చేర్చటమే తమ లక్ష్యమని అంటారు. ఇప్పుడున్నపరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ అభిమానులు చెప్పే అఖండ్ భారత్ మాట వాస్తవానికి ఎంత దూరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారి మాటల్ని గుర్తు చేసేలా సంచలన వ్యాఖ్యను చేశారు ఎన్సీపీకి చెందిన నేత.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.

ఇటీవల బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కరాచీ భారత్ లో భాగం అవుతుందన్న వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని కోట్ చేసిన మాలిక్.. ఆ వ్యాఖ్యల్ని తాను స్వాగతిస్తానని చెప్పారు. పాక్.. బంగ్లాదేశ్ లు భారత్ లో విలీనం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
బెర్లిన్ గోడను పడగొట్టగలిగినప్పుడు.. పాక్.. బంగ్లాదేశ్ లు భారత్ లో ఎందుకు విలీనం కావు? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ మూడింటిని కలిపి ఒకే దేశంగా మార్చాలని బీజేపీ కోరుకుంటే.. తాము స్వాగతిస్తామని చెప్పారు. ఆచరణకు ఏ మాత్రం సాధ్యం కాని ఈ మాటలు మహారాష్ట్ర మంత్రి నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. అంతేకాదు.. ముంబయి మున్సిపల్ ఎన్నికల్లోనూ తాము శివసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు. మరి.. ఈ మంత్రిగారి మాటలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయో? ఎవరు ఎలా అనుకున్న.. సంఘ్ పరివార్ లోని పలువురు మాత్రం మంత్రి మాటలు ఆనందానికి గురి చేస్తాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News