ఆ నటి ఆత్మహత్యకు ఎన్సీబీనే కారణం.. మంత్రి సంచలన ఆరోపణలు

Update: 2021-12-27 04:12 GMT
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ పేరిట సెలబ్రెటీలను టార్గెట్ చేసిన ఎన్సీబీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్సీబీ ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆర్మీ ముంబైలో బెదిరింపులకు , వసూళ్లకు పాల్పడుతోందని నవాబ్ మాలిక్ ఆరోపించారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో ఎన్సీబీని తీవ్రంగా తప్పు పట్టిన నవాబ్ మాలిక్.. ఆర్యన్ కు, షారుఖ్ కు అందరికంటే ఎక్కువగా మద్దతిచ్చారు. ఇప్పుడు మరోసారి ఎన్సీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఎన్సీబీ చీఫ్ గా ఉన్న అధికారి సమీర్ వాఖండేను సైతం పదే పదే టార్గెట్ చేసిన నవాబ్ మాలిక్ ఈసారి ఎన్సీబీ అధికారుల పేర్లు ప్రస్తావించకుండా బాంబు పేల్చారు. నార్కోటిక్ బ్యూరో తరుఫున ఓ ప్రైవేటు ఆర్మీ నడుస్తోందని ఆరోపించారు. గోసవీ, మనీష్ భానుశాలి వంటి వారు ఎన్సీబీ అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

గత గురువారం ఓ భోజ్ పురి యువ నటి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన నవాబ్ మాలిక్ ఆమె మృతికి బెదిరింపులే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ఓ రేవ్ పార్టీలో తను కనిపించడంతో ఎన్సీబీ తాలూకూ మనుషులమంటూ ఇద్దరు నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు. వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆమె లక్షల కొద్దీ డబ్బులు ముట్టజెప్పి కూడా ఉరివేసుకొని మరణించింది.

ముంబై పోలీసులు నటి మరణానికి కారకులుగా భావిస్తున్న వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక ఎన్సీబీ పరోక్షంగా ఉందని తాజాగా నవాబ్ మాలిక్ ఆరోపిస్తున్నాడు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News