జతివుమ్రా రైవిండ్ సోకు వింటే షాక్ తినాల్సిందే

Update: 2015-12-30 05:27 GMT
రష్యా పర్యటన వెళ్లిన ప్రధాని మోడీ ఆ తర్వాత అప్ఘానిస్థాన్ వెళ్లటం.. అక్కడ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఆయన.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ పాకిస్థాన్ కు సర్ ప్రైజ్ విజిట్ చేయటం తెలిసిందే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బర్త్ డే విషెస్ తో పాటు.. ఆయన మనమరాలి పెళ్లికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాహోర్ కు విమానాశ్రయానికి చేరుకున్న మోడీని.. ఒక హెలికాఫ్టర్ లో షరీఫ్ తీసుకెళ్లటం తెలిసిందే.

లాహోర్ విమానాశ్ర్రాయానికి కాస్త దూరంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇంటికి తీసుకెళ్లారు. హెలికాఫ్టర్ లో తీసుకెళ్లిన నవాజ్ షరీఫ్ ఇంటి రేంజ్ ఏమిటన్న సంగతి కాస్త లోతుల్లోకి వెళ్లి టచ్ చేస్తే షాక్ తినాల్సిందే. ఇంతకీ జతివుమ్రా రైవింగ్ అంటే మరేంటో కాదు.. అది షరీఫ్ ప్యాలెస్ పేరు. ఆ సువిశాలమైన ప్యాలస్ కబుర్లలోకి వెళ్లే ముందు.. నవాజ్ షరీఫ్ పూర్వాపరాల్లోకి వెళితే.. దేశ విభజనకు ముందు వారిది మన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ కు దగ్గరగా ఉన్న జతీఉమ్రా అనే గ్రామానికి చెందిన వారు.

కాశ్మీరీ పంజాబీ మూలాలు ఉన్న నవాజ్ షరీఫ్ కుటుంబం దేశ విభజనకు ముందు ఆయన తండ్రి మియా మొహమ్మద్ షరీఫ్ సాహెబ్ తన ఆరుగురు సోదరులతో కలిసి పాక్ కు వెళ్లిపోయారు. అక్కడి లాహోర్ కు చేరుకున్న వారు.. ఇత్తేఫాక్ అనే పేరు మీద ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఇనుము.. ఉక్కు వ్యాపారం చేసే వారు.

రాజప్రాసాదం సైతం చిన్నబోయే షరీఫ్ ప్యాలెస్ వివరాల్లోకి వెళితే.. 5వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న పచ్చని పొలాల మధ్యలో రాజఠీవీలో వెలిగిపోతూ ఉంటుందీ ‘‘జతివుమ్రా రైవిండ్’’. దాదాపు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలస్ లో షరీఫ్ తండ్రి సమాధి కూడా ఉంటుంది. నవాజ్.. ఆయన భార్య.. పిల్లలు.. మనమలతో పాటు.. తల్లి.. సోదరుడు ఫ్యామిలీ మొత్తం ఇందులోనే నివసిస్తుంటారు.

వీరి ఇంటి కుటుంబ సభ్యుల కోసం పాక్ సర్కారు 364 మిలియన్ రూపాయిల్ని ఖర్చు చేస్తోంది. ఈ ఇంటికి 4.4 కిలోమీటర్ల ఫెన్సింగ్ వేస్తూ.. ఇందు కోసం 90 సీసీ కెమేరాలు.. 100 ఎల్ఈడీ బల్బ్ లు.. 20 అత్యంత భద్రమైన చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నిత్యం ఈ ఇంటి రక్షణ కోసం 2,751 మంది పోలీసులు కాపలా కాస్తుంటారు. మరి.. ఇంత భారీ నివాసం ఎంత విలువ చేస్తుందో కదూ? పేద దేశమైన పాక్ లో ఇంత వైభోగం పొందే నవాజ్ లాంటి వారిని చూస్తే.. ఆ దేశం ఎప్పటికి బాగుపడేనన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News