బాబు బ్యాచ్‌ ని క‌డిగేసిన నాయిని!

Update: 2018-11-30 04:37 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది.  మొన్న‌టి వ‌ర‌కూ ఒక మోస్త‌రుగా ఉన్న ప్ర‌చారం ఈ గ‌డిచిన రెండు రోజులుగా మ‌రింత ఉధృత‌మైంది. క్యాలెండ‌ర్ లో కదిలిపోతున్న తేదీల సాక్షిగా.. ఉన్న ప‌రిమిత కాలంలో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డేందుకు ఎవ‌రికి వారు త‌మ త‌మ అస్త్ర‌శ‌స్త్రాల్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు.

ఇలాంటి వేళ తాజా మాజీ హోంమంత్రి నాయిని నోరు విప్పారు. మామూలుగా మాట్లాడితేనే కొట్టిన‌ట్లుగా మాట్లాడే నాయిని లాంటి నేత‌కు కోపం వ‌స్తే ఆయ‌న మాట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనికి త‌గ్గ‌ట్లే నాయిని తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పాలి.

టీఆర్ ఎస్ ప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌న్న వాద‌న ప‌లు చోట్ల వినిపిస్తున్న వేళ‌.. అలాంటిదేమీ లేద‌న్న సంకేతాలు ఇచ్చేలా నాయిని వ్యాఖ్య‌లు ఉన్నాయి. కూట‌మిని హోల్ సేల్ గా తిట్టి పారేసిన ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌మ అమ్ముల పొదిలోని ఉద్య‌మ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు నాయిని.

ఉద్య‌మంలో తాము లాఠీ దెబ్బ‌లు తింటే క‌నీసం ప‌రామ‌ర్శించ‌టానికి రాలేదని.. తెలంగాణ ఇవ్వొద్దంటూ నిజాం కాలేజీలో స‌భ పెట్టిన వైనాన్ని గుర్తు చేసిన ఆయ‌న.. సిగ్గు లేదురా ప్ర‌జ‌ల్ని ఓట్లు అడ‌గ‌టానికి అంటూ కాంగ్రెస్‌.. టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తాజాగా నిర్వ‌హించిన ఆశీర్వాద స‌భ‌లో మాట్లాడిన నాయిని.. త‌న నోటికి ఉన్న బ్రేకుల్ని వ‌దిలేశారు. ఘాటైన ప‌ద‌జాలంతో విరుచుకుప‌డిన ఆయ‌న‌.. బ‌క్క‌ప‌ల్చ‌టి వ్య‌క్తిని ఎదుర్కోవ‌టానికి మోస‌గాళ్లంతా కూట‌మిగా వ‌స్తున్నారంటూ విరుచుకుప‌డ్డారు. కూడ‌గ‌ట్టుకొని వ‌స్తున్న వైనాన్ని త‌ప్పు ప‌డుతూ.. ఒక్కొక్క‌రిగా వ‌చ్చే ధైర్యం లేదురా? అంటూ ఆయ‌న తిట్ల వ‌ర్షం కురిపించారు. మొత్తమ్మీదా కూట‌మిపై ఈస్థాయిలో విరుచుకుప‌డిన నేత నాయినినే అవుతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News