మోడీకి షాక్ ఇచ్చిన న‌య‌న‌తార

Update: 2015-10-06 15:45 GMT
భార‌త‌దేశ తొలి ప్ర‌ధాని పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ మేన‌కోడ‌లు, ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి న‌య‌న‌తార సెహ‌గ‌ల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సాహిత్య రంగంలో ఉత్త‌మ ప్ర‌తిభ‌కు గాను కేంద్రం త‌న‌కు ఇచ్చిన సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారాని  వ‌దులుకుంటున్న‌ట్టు ఆమె మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. త‌న అవార్డును వ‌దులుకున్న సంద‌ర్భంగా ఆమె భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌రేంద్ర‌మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక దేశంలో సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్ర‌క్రియ వేగ‌వంత‌మైంద‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. సాహితీవేత్త‌ల‌కు, క‌ళాకారుల‌కు అస్స‌లు గౌర‌వం అనేదే లేకుండా పోతోంద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

గ‌తంతో కూడా మోడీపై అనేక విమ‌ర్శ‌లు చేసిన న‌య‌న‌తార సెహ‌గ‌ల్ ఇప్పుడు ఎన్డీయే ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌న‌కు ల‌భించిన కేంద్ర సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారాన్నివెన‌క్కు ఇవ్వ‌డం అటు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు ఇటు సాహితీలోకంలో కూడా తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. నెహ్రూ సోద‌రి పండిట్ విజ‌య‌ల‌క్ష్మి రెండో కుమార్తె న‌య‌న‌తార‌. 1927లో జ‌న్మించిన న‌య‌న‌తార సెహ‌గ‌ల్ త‌న మేన‌మామ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నుంచే ర‌చ‌నా ల‌క్ష‌ణాల‌ను అల‌వ‌ర‌చుకున్నారు. భార‌త‌దేశ ఆంగ్ల ర‌చ‌నా స్వ‌భావంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించిన ఆధునిక ర‌చ‌యిత‌ల్లో ఒక‌రిగా ఆమెకు పేరుంది.

న‌య‌నతార సెహ‌గ‌ల్ ఆంగ్లంలో రాసిన " రిచ్ లైక్ అజ్ " అనే న‌వ‌ల‌కు 1986లో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. న‌య‌న‌తార నిర్ణ‌యం ఎలాంటి  ప‌రిణామాల‌కు దారి తీస్తుందో అన్న చ‌ర్చ‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. నిన్నటికి నిన్నే బీజేపీ కురువృద్ధుల్లో ఒకరైన రాంజెఠ్మలానీ సోష‌ల్ మీడియాలో మోడీ ఓట‌మి చూడాల‌ని ఉంద‌ని త‌న అభిప్రాయం చెప్పి పెద్ద సంచ‌ల‌నం రేపారు. తాజాగా ఈ రోజు ఎంతో పేరున్న ఓ ర‌చ‌యిత్రి, మాజీ ప్ర‌ధాని నెహ్రూ మేన‌కోడ‌లు త‌న‌కు ల‌భించిన అవార్డును మోడీని టార్గెట్‌గా చేసుకుని రిజ‌క్ట్ చేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News