కోమటిరెడ్డి కొడుకును నయిం చంపించాడా?

Update: 2016-08-23 05:18 GMT
గ్యాంగ్ స్టర్ నయింకు సంబంధించిన ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్.. అతని స్నేహితులు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించిన ఉదంతం తన ప్లాన్అని.. తానే హత్య చేయించినట్లుగా తనను బెదిరించిన సందర్భంగా నయిం చెప్పాడంటూ ఒక వ్యాపారస్తుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. 2011 డిసెంబరు 21లో మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామ శివార్లలో ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్.. అతని స్నేహితులు ఇద్దరూ మరణించగా.. మరో స్నేహితుడు అరవ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఇది రోడ్డు ప్రమాదమని.. గొర్రెల్ని తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పినట్లుగా పోలీసులు అప్పట్లో తేల్చారు.

పోలీసు రికార్డుల్లో ‘రోడ్డు ప్రమాదం’గా ఉన్న ఉదంతం వెనుక అసలు కారణంగా నయిం ప్లాన్ అన్న విషయాన్ని ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదులో బయటకు వచ్చింది. తనను డబ్బులు కోరిన నయిం.. డబ్బు ఇవ్వకపోతే అప్పటి మంత్రి కోమటిరెడ్డి కొడుకు మాదిరే తన కుమారుడ్ని చంపుతానని బెదిరించినట్లుగా గంపా నాగేందర్ అనే వ్యాపారి పోలీసులకు ఇచ్చిన తాజా ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం.

గత మార్చి 18న నయిం అనుచరులు తనను నయిం దగ్గరకు తీసుకెళ్లారని.. ఈ సందర్భంగా తనకు రూ.5కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి వెల్లడించారు. రూ.5కోట్లు ఇవ్వకుండా తన కుటుంబీకుల్ని హతమారుస్తానని.. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా తన కుమారుల్ని చంపుతానని చెప్పినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కుమారుడి ప్రస్తావన చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదంతా నయిం బెదిరింపు కోసమే చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోవాలని నయిం తనను బెదిరించినట్లుగా ఈ మధ్యన కోమటిరెడ్డి సోదరుడు.. కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యనే చెప్పటం గమనార్హం. వ్యాపారి గంపా నాగేందర్ చెప్పిన మాటల్లో నిజమెంత? నయిం అలా ఎందుకు చెప్పాడు? ప్రతీశ్ మృతి వెనుక నిజంగానే నయిం ప్లానింగ్ ఉందా? అన్న కోణంలో పోలీసులు మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News