నవ్యాంధ్రలో నయీమ్ దందాలు

Update: 2016-08-16 07:30 GMT
గ్యాంగ్‌ స్టర్ నయీముద్దీన్ దందాలు హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనే ఎక్కువగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లినా అది షెల్టర్ తీసుకోవడానికి - నేరగాళ్లతో డీల్సు కుదుర్చుకోవడానికే తప్ప ఆయా రాష్ట్రాల్లో దందాలు చేయడం తక్కువే. కానీ... తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత ప్రధాన నగరమైన విశాఖలోనూ నయీం బాగానే నెట్ వర్క్ ఏర్పరుచుకున్నట్లు విచారణలో తెలుస్తోంది. ముఖ్యంగా గత రెండు - మూడు నెలల్లో పలుమార్లు విశాఖకు వచ్చి వెళ్లాడని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.  నయీమ్ విశాఖ ఎందుకొచ్చినట్టు? ఏమైనా సెటిల్‌ మెంట్లు - దందాలు చేశాడా? అన్న అంశాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. సిట్ అధికారులు ఆదివారం విశాఖలో ప్రధానంగా రైల్వేస్టేషన్‌ పై దృష్టి సారించి.. ఆర్‌ పీఎఫ్ - రైల్వే పోలీసు - ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విశాఖ నుంచి వెళ్లే గోదావరి - దురంతో ఎక్స్‌ ప్రెస్‌ ల రిజర్వేషన్ టికెట్ల వివరాలను - ప్లాట్‌ ఫారాల సీసీ టీవీ ఫుటేజీలను తీసుకున్నారు. నయీం - అతడి అనుచరుల రాకపోకల జాడలేమైనా తెలుస్తాయేమో అని రైల్వే శాఖ వైపు నుంచి విచారణ జరుపుతున్నారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత, విశాఖలో భూముల ధరలు ఆకాశాన్ని తాకగా - అక్కడ దందాలు చేసేందుకు పలుమార్లు నయీమ్ - తన అనుచరులతో కలసి విశాఖకు వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. విశాఖకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా రైల్లోనే ప్రయాణించేవాడని గుర్తించిన సిట్ - సికింద్రాబాద్ - విశాఖపట్నం రైల్వే స్టేషన్లలోని సీసీ ఫుటేజ్ లన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

నయీమ్ ఇప్పటికే విశాఖలో సెటిల్ మెంట్లు చేశాడని.. అక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్న లోకల్ టీంలో సభ్యులెవరన్నది గుర్తించి పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో విశాఖ పోలీసుల సహకారం తీసుకోవాలని సిట్ నిర్ణయించింది.
Tags:    

Similar News