ఇన్నాళ్లకు మోడీ బ్యాచ్ కు పట్టు చిక్కిందా?

Update: 2020-06-21 04:30 GMT
దాదాపు ఆరేళ్ల క్రితమే అదిరిపోయే విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మోడీ. చేతికి పగ్గాలు చిక్కినా.. పాలించే విషయంలో పరిమితులు ఆయన్ను పలు సందర్భాల్లో కట్టి పారేశాయి. అన్నింటికి మించి.. రాజ్యసభలో బీజేపీకి లేని బలం తెగ ఇబ్బంది పెట్టేది. ప్రభుత్వ విధానాల్ని ప్రతిబింబించేలా చేయటం కోసం మోడీ సర్కారు కిందామీదా పడేది. లోక్ సభలో పాస్ అయినా.. రాజ్యసభకు వచ్చేసరికి కొర్రీలు పడటం మింగుడు పడేది కాదు. దీంతో కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే రాజ్యసభలో తమకు బలం లేదన్నది సమస్యగా మారేది.

ఇప్పుడు ఆ చికాకుల నుంచి బయటపడినట్లే. ఆ మధ్య వరకు పెద్దల సభలో తమ బలాన్ని పెంచుకోవటం కోసం విపరీతంగా ప్రయత్నించిన మోడీ సర్కారు.. ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారని చెప్పాలి. తాజాగా ముగిసిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ బలం 86కు పెరగ్గా.. కాంగ్రెస్ బలం 41కు తగ్గిపోయింది. మొత్తం 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో మెజార్టీకి బీజేపీ దూరంగా ఉన్నట్లు కనిపించినా మిత్రపక్షాలు.. తనకు మద్దతు నిలిచే పార్టీల బలాల్ని పరిగణలోకి తీసుకుంటే.. సభలో ఆ పార్టీ మెజార్టీని సొంతం చేసుకుంది.

సొంతంగా 86 స్థానాలున్న బీజేకి మిత్రపక్షాల బలం కలుపుకుంటే రాజ్యసభలో ఆ పార్టీకి బలం వందకు చేరుకుంది. ఇక.. అవసరానికి ఆదుకునే అన్నాడీఎంకే.. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు పలు చిన్నపార్టీల మద్దతును కలుపుకుంటే పెద్దల సభలో బీజేపీకి తిరుగులేని పరిస్థితి. చేతికి అధికారం 2014లోనే వచ్చినా.. పట్టు చిక్కని పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు. పెద్దగా బలం లేని సమయంలోనే తాను అనుకున్న ఎజెండాను అమలు చేయటం కోసం శ్రమించిన మోడీ.. రానున్న రోజుల్లో పాలనపై తన మార్కు వేసేందుకు ఆయనకు ఎలాంటి అడ్డంకులు లేనట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News