చెప్పిన‌ట్లే జ‌రిగింది..మోడీషా అభ్య‌ర్థిదే విజ‌యం

Update: 2018-08-09 07:10 GMT
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నాలే నిజ‌మ‌య్యాయి. విపక్షాల అనైక్య‌తే త‌న బ‌లంగా భావిస్తున్న మోడీషాల‌కు మ‌రో విజ‌యం సొంత‌మైంది. మోడీపై వ్య‌తిరేక‌త ఉన్నా.. వ్య‌తిరేకించే వారంద‌రిని ఒకేతాటి మీద న‌డిపించే విష‌యంలో జ‌రుగుతున్న పొర‌పాట్లు మోడీకి వ‌రంగా మారుతోంది. తాజాగా అదే అంశం మ‌రోసారి నిరూపిత‌మైంది.

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి సంబంధించి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార‌ప‌క్ష అభ్య‌ర్థి హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ 20 ఓట్ల వ్య‌త్యాసంగా విజ‌యం సాధించారు. మోడీషాల‌కు చురుకు పుట్టేలా సాగిన ఎన్నిక‌ల తీరు.. ఒక‌ద‌శ‌లో షాకింగ్ ఫ‌లితాలు వెలువ‌డే ప్ర‌మాదం పొంచి ఉందా? అన్న కంగారుకు గురైన ప‌రిస్థితి.
ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌రిగే చివ‌రి నిమిషం వ‌ర‌కూ అప్ర‌మ‌త్తంగా ఉన్న ఎన్డీయే వ‌ర్గం ఎట్ట‌కేల‌కు తాము అనుకున్న‌ట్లే విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఎన్డీయే అభ్య‌ర్థి హ‌రివంశ్ నారాయ‌ణ్ కు 125 ఓట్లు రాగా.. ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థి కాంగ్రెస్ నేత హ‌రిప్ర‌సాద్ కు 105 ఓట్లు ద‌క్కాయి. దీంతో.. రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ గా హ‌రివంశ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో 244 మంది స‌భ్యులు ఉన్నారు.  ఈ రోజు జ‌రిగిన ఎన్నిక‌కు ఆమ్ ఆద్మీ పార్టీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో స‌హా మొత్తం 14 మంది స‌భ్యులు ఎన్నిక‌కు దూరంగా ఉన్నారు. దీంతో.. సంఖ్యా బ‌లం 230కి త‌గ్గింది. ఇందులో 125 మంది స‌భ్యుల బ‌ల‌మున్న ఎన్డీయే విజ‌యం సాధించింది. మ‌రో ప‌ది నెల‌ల వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ‌.. మోడీకి వ్య‌తిరేక పార్టీల‌న్నీ ఒక జ‌ట్టుగా మారి..ఈ ఎన్నిక‌ల్లో మోడీకి షాక్ తినిపించాల‌ని భావించారు. అయితే.. ఈ విష‌యాన్ని గుర్తించిన మోడీషాలు త‌మ‌దైన మంత్రాంగంతో త‌మ‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌నుకున్న శివ‌సేన‌ను త‌మ‌కు ఓట్లు వేసేలా చేసుకున్నారు. అంతేకాదు.. ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా దూరంగా ఉండేలా వ్య‌వ‌మ‌రించ‌టం కూడా ఎన్డీయే విజ‌యానికి కార‌ణంగా మారిన‌ట్లు చెబుతున్నారు. మొత్తానికి పోల్ మేనేజ్ మెంట్ లో త‌మ‌కు మించినోళ్లు మ‌రొక‌రు లేర‌న్న విష‌యాన్ని తాజా ఫ‌లితంతో మోడీషాలు మ‌ళ్లీ నిరూపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News