గ్రేటర్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోచూసుకున్నారా?

Update: 2021-10-20 03:55 GMT
కొన్ని నెలల క్రితం.. అదేనండి గత ఏడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలు గుర్తున్నాయా? ఆ ఎన్నికల్లో వంద కాదు 110 నుంచి 120సీట్లు ఖాయమని చెప్పటం.. తీరా చూస్తే చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి. గులాబీ దళం ఏ మాత్రం ఊహించని విధంగా వచ్చిన ఫలితాలు కేసీఆర్ అండ్ కోకు కోలుకోలేని షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.తాము ఎన్ని చెప్పినా.. ఎంతలా వరాలు ప్రకటించినా.. తాము కోరుకున్న విజయం మాత్రం తమ సొంతం కాలేదన్న వేదన మాత్రం గులాబీ నేతలకు మిగిలేలా చేసింది.

గ్రేటర్ చేదు అనుభవం టీఆర్ఎస్ కు చాలానే పాఠాల్ని నేర్పిందని చెప్పాలి. ఏసీ గదుల్లో తాము చేసే ప్లానింగ్ కు.. క్షేత్రస్థాయిలో అమలయ్యే దానికి ఏ మాత్రం సంబంధం లేనట్లుగా పనులు జరగటాన్ని గుర్తించారు. ఈ లోపాన్ని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిగమించారని చెప్పాలి. తాజాగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక నెగిటివ్ సెంటిమెంట్ కొందరి నోట వినిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికల వేళలోనే ఇలానే జరగటం.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ రిపీట్ కావటం చూస్తే.. ఉప ఎన్నిక ఫలితం గులాబీ బాస్ అంచనాలకు భిన్నంగా వచ్చే అవకాశం ఉందన్న భావన కలిగేలా చేస్తోంది.గ్రేటర్ ఎన్నికలు జరగటానికి ముందు భారీ వర్షాలు.. వరదలతో మహానగరం కిందామీదాపడటం.. పలు ప్రాంతాలు వాననీళ్లతో మునిగిపోయి.. పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాన్ని కలిగేలా చేశాయి.

దీనికి ఉపశమనంగా.. వానలు.. వరదల కారణంగా నష్టపోయిన వారందరికి రూ.10వేలు చొ్పున పరిహారం ప్రకటించటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన పరిహార మొత్తాన్ని పంపిణీ చేయటం తెలిసిందే. దీంతో.. ఈ పరిహారం కోసం జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అర్హులైన బాధితులకు కొన్ని వందల రెట్లు ఎక్కువగా అనర్హులకు చేరింది. ఈ రూ.10వేల మొత్తాన్ని పంపిణీ చేయకుండా అప్పట్లో ఎన్నిక సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఎవరూ నిరాశ చెందవొద్దని.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాతి రోజునుంచే మళ్లీ రూ.10వేల మొత్తాన్ని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కట్ చేస్తే.. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుండటం.. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు నుంచే దళితబంధు పేరుతో అర్హులైన వారికి రూ.10 లక్షల భారీ మొత్తాన్ని సాయంగా అందించటం.. దళిత వర్గాల వారు వ్యాపారాలు చేసుకుంటూ పేదరికానికి దూరం కావాలని సీఎం కేసీఆర్ కాంక్షిస్తున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక అయ్యే వరకు హుజూరాబాద్ లో నిర్వహిస్తున్న దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా ఆపాలని ఈసీ బ్రేకులు వేయటం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహంతో ఉన్న విషయం ఆయన స్పందనను చూస్తే అర్థమవుతుంది. కాకుంటే.. గ్రేటర్ ఎన్నికల వేళ నాడు వరద బాధితులకు పంపిణీ చేసిన రూ.10వేలకు చెక్ పెడితే.. తాజా ఉప పోరులో రూ.10లక్షల సాయాన్నిఅందించే దళితబంధుకు చెక్ చెప్పటం తెలిసిందే. కొంపదీసి సెంటిమెంట్ రిపీట్ అయి.. గ్రేటర్ ఎన్నికల ఫలితం మాదిరే హుజూరాబాద్ ఉప పోరు రిజల్ట్ ఉండనుందా?
Tags:    

Similar News