మేక‌పాటి కుటుంబంలో రాజ‌కీయ క‌ల‌క‌లం.. శ్రీకీర్తిని ప‌క్క‌న పెట్టారా?

Update: 2022-04-10 08:18 GMT
గత ఫిబ్రవరిలో హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు. విక్రమ్‌ రెడ్డి రాజకీయ ప్రవేశానికి మేకపాటి కుటుంబం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విక్రమ్‌రెడ్డిని బరిలో నిలపాలని మేకపాటి కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందించారు.

విక్రమ్‌రెడ్డి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ద్వితీయ కుమారుడు. కాగా, గౌతంరెడ్డి స్థానాన్ని ఆయన సతీమణి శ్రీకీర్తితో భర్తీ చేస్తారని అందరూ భావించారు. అయితే కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, చర్చల అనంతరం విక్రమ్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇదిలావుంటే, ప్రస్తుత మంత్రివర్గ కూర్పులోనే విక్రమ్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకొని, ఆ తర్వాత ఉప ఎన్నికల బరిలోకి దింపుతారా? లేక ఉప ఎన్నికల తరువాత మంత్రిని చేస్తారా? అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇదిలావుంటే.. అస‌లు రాజ‌కీయ రంగంలోకి వ‌స్తార‌ని.. భావించిన గౌతం రెడ్డి స‌తీమ‌ణి శ్రీకీర్తి పేరు అనూహ్యంగా ఎందుకు జారిపోయింది?  ఆమెను ఉప ఎన్నిక‌లో ఎందుకు ప్ర‌తిపాదించ‌లేదు. అస‌లు రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌నే ఉద్దేశ‌మే లేదా?  అనే విష‌యం నెల్లూరులో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి గౌతంరెడ్డి మ‌ర‌ణం తర్వాత‌.. శ్రీకీర్తికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తార‌ని అనుకున్నారు. ఇదే జ‌రిగితే..నెల్లూరులో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి ఒక మ‌హిళా నేత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టే అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా కీర్తి పేరును ప‌క్క‌న పెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. మేక‌పాటి కుటుంబం నుంచి విక్ర‌మ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తుండ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు బ‌ట్ట‌క‌పోయినా.. శ్రీకీర్తి విష‌యం ప‌క్క‌న పెట్ట‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమే కావాల‌ని.. త‌ప్పుకొన్నారా?  లేక‌.. త‌ప్పించారా? అని అనుకుంటున్నా రు.  అయితే.. శ్రీకీర్తికి రాజకీయాల‌పై ఆస‌క్తి లేద‌ని.. ఒత్తిడి, విమ‌ర్శ‌లు త‌ప్ప‌.. రాజ‌కీయాల్లో ఉండేది ఏముంటుంద‌ని..ఆమె భావించి ఉంటార‌ని.. అంటున్నారు.

పైగా బాధ్య‌త‌లు కూడా ఎక్కువ‌గా ఉన్నందున ఆమె వ్యాపారాన్ని నిర్వ‌హించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. మేక‌పాటి కుటుంబ స‌భ్యులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో విక్ర‌మ్ చూస్తున్న వ్యాపారాల‌ను త్వ‌ర‌లోనే శ్రీకీర్తికి అప్ప‌గించి.. రాజ‌కీయాల‌కు విక్ర‌మ్ కు ఇస్తార‌ని అంటున్నారు. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. చెబుతున్నారు. దీనిపై గౌతం రెడ్డి అభిమానులు కొంత నొచ్చుకుంటున్నా.. మేక‌పాటి కుటుంబ నిర్ణ‌యం మాత్రం హ‌ర్షిస్తామ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News