నెట్ న్యూట్రాలిటీ లేకుంటే నష్టాలేంటి?

Update: 2016-02-13 17:30 GMT
'నెట్‌ న్యూట్రాలిటీ' కొన్నాళ్లుగా రగులుతున్న ఈ అంశం తాజాగా ట్రాయ్ నిర్ణయంతో మరోసారి చర్చలోకొచ్చింది.  ఫేస్ బుక్ ప్రతిపాదించిన ఫ్రీ బేసిక్స్ కు కళ్లెం వేసి ట్రాయ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న ఫేస్ బుక్ ఫ్రీబేసిక్స్ కోసం పెద్ద ఎత్తుగడే వేసింది. అది సాధించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే.. దేనిదారి దానిదే అన్నట్లుగా ట్రాయ్ మాత్రం ఈ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించింది. అయితే.. ట్రాయ్ నిర్ణయంతో నెట్ న్యూట్రాలిటీ వచ్చేసినట్లేనా..? ఇంకే ముప్పూ లేదా? అంటే తెల్లమొహం వేయాల్సిందే.  అసలు సమస్య ఫ్రీ బేసిక్స్ ఒక్కటే కాదు... ఇంటర్ నెట్ స్వేచ్ఛ.. అంతర్జాల వాడకానికి సర్వీసు ప్రొవైడర్లు విధిస్తున్న రుసుముల్లో వ్యత్యాసాలు ఎలా దానిపై ప్రభావం చూపిస్తున్నాయన్నదీ చూడాలి. నెట్ న్యూట్రాలిటీకి కేవలం ఫేస్ బుక్ నుంచే కాదు... భారతీయ టెలికాం కంపెనీల నుంచీ ముప్పు పొంచుకొస్తోంది. ట్రాయ్ ఆదేశాలు ఫేస్ బుక్ ను ఇప్పటికే అడ్డుకుని ఉండొచ్చు కానీ, భారత కంపెనీల దురుద్దేశాలనూ ట్రాయ్ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.  నెట్ న్యూట్రాలిటీ పోరాటం ముగియలేదు.. కొత్త రూపాల్లో నెట్ న్యూట్రాలికీ పొంచి ఉన్న ముప్పుపైనా పోరాడాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

ఇంటర్‌ నెట్‌ బ్రాడ్‌ బాండ్‌ ను ఉపయోగించుకుంటూ వాయిస్‌ - వీడియో కాల్స్‌ చేసుకోవడానికి కొన్ని పదుల యాప్స్‌ సిద్ధంగా ఉండగా.. ఏటా వీటి సంఖ్య రెట్టింపు కంటే వేగంగా పెరుగుతోంది. వీటివల్ల ప్రభుత్వ రంగంలో సేవలందిస్తున్న బిఎస్‌ ఎన్‌ ఎల్‌ తోపాటు ప్రయివేటు టెలికమ్‌ ఆపరేటర్ల ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. పైగా ఇంటర్‌ నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఒక్క పైసా కూడా చెల్లించకుండా తమ సేవల్ని దుర్వినియోగం చేస్తున్నారనే  కోణమూ ఇందులో ఉంది. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ ఇలాంటి యాప్స్‌ పైనా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.  టెలికమ్‌ ఆపరేటర్లూ అందుకు అంగీకరించారు. కానీ, ఫేస్‌ బుక్‌ ఫ్రీ బేసిక్స్‌ పేరుతో తన ఎత్తుగడను మొదలు పెట్టగానే మొత్తం సీనంతా మారిపోయింది.  సోషల్ మీడియాలో కింగ్ లా ఉన్న ఫేస్‌ బుక్‌ తన గుత్తాధిపత్యానికి ఏ రూపంలో దెబ్బ తగలరాదన్న ఉద్దేశంతో ఈ ఫ్రీ బేసిక్స్‌ కు తెరతీసింది.  ప్రపంచానికి ఇంటర్‌ నెట్‌ ను ఉచితంగా అందించాలన్న ఫేస్‌ బుక్‌ అధినేత జుకర్‌ బర్గ్‌ ఆలోచనకు మన దేశంలో వ్యతిరేకత వచ్చింది.  వినియోగదారుడికి   ఇంటర్‌ నెట్‌ లో ఏం కావాలో ఎంచుకునే స్వేచ్ఛ లేకపోవడం ఇండియాలో ఎవరికీ నచ్చలేదు. దీంతో ఇక్కడ దానిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

చివరకు ట్రాయ్ కూడా ఫేస్ బుక్ కు మొట్టికాయలు వేసింది. దీంతో ఫేస్ బుక్ ట్రాయ్ నిర్ణయాన్ని తొలుత జీర్ణించుకోలేకపోయింది. ఆ సంస్థ బోర్డ్ మెంబర్ మార్క్ ఆండ్రిసన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియాది వలసవాద భావజాలం అంటూ మండిపడ్డారు. కానీ, ఆ తరువాత దానివల్ల ఫేస్ బుక్ కే నష్టమని గుర్తించి ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అంతేకాదు... ఆ క్షమాపణలు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి కూడా భారతీయులు ఇష్టపడకపోవడంతో స్వయంగా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గే రంగంలోకి దిగారు. తమ బోర్డు మెంబర్ మాటలను తాను బాధపడుతున్నానని.... భారత మార్కెట్ తమకెంతో ముఖ్యమని ప్రకటిస్తూ ఆండ్రీసన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని చెప్పి ఫేస్ బుక్ కు నష్టం రాకుండా ప్రయత్నం చేశారు.

ఇక అసలు విషయానికొస్తే..  ఫ్రీబేసిక్స్ కోసం ఫేస్‌ బుక్‌ వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలూ చేసింది.  దేశంలో అన్ని జాతీయ - ప్రాంతీయ పత్రికల్లో ఫుల్‌ పేజీ యాడ్స్‌ - ఎలక్ట్రానిక్‌ మీడియాలో యాడ్స్‌ - మిస్డ్‌ కాల్‌ అలెర్ట్స్‌... దేశం నలుమూలల నగరాలు - పట్టణాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్‌ లతో నెట్‌ న్యూట్రాలిటికీ అనుకూలంగా ప్రచారం చేసింది. అదే సమయంలో ఫేస్‌ బుక్‌ ఫ్రీ బేసిక్స్ ను వ్యతిరేకిస్తున్న వర్గాలు మాత్రం తమ అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి ఫేస్ బుక్ నే ప్రధాన సాధనంగా వాడుకున్నాయి.  ఇంటర్ నెట్‌ అంటే ఫేస్‌ బుక్‌ మాత్రమే అనేలా వ్యవహరిచిన జుకర్ బర్గ్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడారు. ట్రాయ్ కూడా ప్రజల ఆలోచనలతో పాటు సొంత ఆలోచనలు కలిపి తన నిర్ణయం వెలువరించింది.

భారత్‌ సహా ప్రపంచ దేశాల్లో ఐటీలో నూతన ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా స్టార్టప్‌ లు నిలుస్తున్నాయి. భారత్‌ లోని ఎక్కువ స్టార్టప్‌ లు ఇ-కామర్స్‌ పై ఆధారపడి ఉన్నాయి. ఇంటర్ నెట్‌ ని ఫ్రీబేసిక్స్‌ అనే చట్రంలో బంధిస్తే ఇలాంటి స్టార్టప్ ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది.

ఇంటర్‌ నెట్‌ సదుపాయం ఉన్నప్పుడు మనకు నచ్చిన విధంగా దానిని ఉపయోగించుకోగలుగుతాం. కానీ, ఫ్రీబేసిక్స్‌ లో అలాంటి అవకాశం ఉండదు. ఒక్కసారి ఫ్రీబేసిక్స్‌ ఫీచర్‌ లేదా అలాంటి యాప్ లకు కనెక్ట్‌ అయితే దాని సొంత బ్రౌజర్‌ లో అది ఏం చూపిస్తే అది చూడాల్సిందే. అక్కడ ఏముంటే అది నమ్మాల్సిందే. ఇక ఆన్ లైన్ షాపింగ్ వంటి విషయంలో అయితే అక్కడ ఏ వస్తువు ఉంటే దాంతో సరిపెట్టుకోవడమే కానీ మిగతా వాటితో బేరీజు వేసుకోవడం.. నచ్చింది కొనుక్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు మనం ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మార్కెట్ లో చాలా బ్రాండ్లున్నాయి. కానీ, ఫ్రీబేసిక్స్‌ లో చూస్తే కొన్నే కనిపిస్తాయి. అక్కడున్న ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఇది ఈ-కామర్స్ తెచ్చిన విప్లవానికి పూర్తి విరుద్ధంగా మారిపోతుంది.

ఫ్రీబేసిక్స్ కు ట్రాయ్ కళ్లెం వేసినా ఇలాంటి ప్రయత్నాలు ఆగిపోతాయని అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ట్రాయ్ కొరడాకు దొరక్కుండా తమ డాటా వినియోగదారులను జారిపోకుండా కాపాడుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లు కొత్త ఆలోచనలు చేస్తున్నారు.  ఇందుకోసం సొంత యాప్ లను తయారుచేసుకుని ఇంటర్ నెట్ ను బైపాస్ చేయడం.. డాటా ప్యాక్ల పరిమాణాన్ని తగ్గించడం వంటి మార్గాలపై చర్చిస్తున్నారు. మొబైల్ తయారీ సంస్థలతో టై అప్ పెట్టుకుని డీఫాల్ట్ గా తమ యాప్స్ అందులో ఉండేలా ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మార్గాలను అనుసరిస్తున్నవారూ ఉన్నారు. ఫ్రీబేసిక్స్ కు వ్యతిరేకంగా ట్రాయ్ ఆదేశాలిచ్చినా అందులోని లూప్ హోల్స్ ను ఉపయోగించుకునే మార్గాలను వెతుకుతున్నారు.  వీటికి కళ్లెం వేసినప్పుడే నెట్ న్యూట్రాలిటీ పూర్తిస్తాయిలో సాధ్యమవుతుంది.

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల డిఫరెన్షియల్ ప్రైసింగ్ విధానం వల్ల నెట్ న్యూట్రాలిటీకి ముప్పు పొంచి ఉంది. ఈ విధానంలో కొన్ని సైట్ లను ఫ్రీగా ఇవ్వడం కానీ, వేగంగా పనిచేసేలా డాటా స్పీడు ఎక్కువ ఉండేలా చేయడం కానీ చేస్తారు. దీనివల్ల ఆ సౌకర్యం లేని వినియోగదారుడు నష్టపోతాడు. ఉదాహరణకు రైల్వే టిక్కెట్లను బుక్ చేయడమే చూద్దాం.. ఏదైనా టెలికాం సంస్థ రైల్వే టిక్కెట్ల బుకింగ్ యాప్ ను అధిక వేగంతో పనిచేసే అవకాశం కల్పించొచ్చు.. అప్పుడు అందులో తత్కాల్ టిక్కెట్ బుక్ చేసే వారు లాభపడతారు.. మిగిలినవారు టిక్కెట్ బుక్ చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఈ విధానంలో పార్ట్ నర్ సైట్లను ఉచితంగా చూసే సౌకర్యం... లేదా అధిక స్పీడుతో చూసే సౌకర్యం కల్పిస్తారు. ఇది కొందరికి బాగానే ఉండొచ్చు. కానీ... తాము తరచూ వినియోగించే సైట్లు వేర్వేరు సర్వీసు ప్రొవైడర్లకు పార్టనర్ లుగా ఉన్నప్పుడు అలాంటి వినియోగదారులు ఆ సర్వీసులన్నీ వేర్వేరుగా తీసుకొని అధిక బిల్లులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారుడి జేబు గుల్ల చేయడం తప్ప ఇంకేమీ కాదు. అంతెందుకు మన పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తాం.. అక్కడ వారు చెప్పే పుస్తకాలు, ఆ యూనిఫాం వంటివి కేవలం వారు సూచించిన చోటే కొనాలని.. అక్కడ తప్ప వేరే ఎక్కడా దొరకని పరిస్థితి ఉంటే మనం ఎంతగా కోపగించుకుంటామో తెలిసిందే కదా. అలాగే ఒక్కో డాక్టరు రాసే మందులు అక్కడున్న మెడికల్ షాప్ లో తప్ప ఇంకెక్కడా దొరక్కపోవచ్చు. వేరే ఇంకెక్కడా తీసుకోవద్దని డాక్టరు మనపై ఒత్తిడి చేయొచ్చు. అప్పుడు మనలో ఆగ్రహం కలుగుతుంది. డిఫరెన్సియల్ డాటా పాక్స్ వల్ల కూడా అంతే అసౌకర్యం ఉంటుంది. అయితే.. స్కూళ్లు, డాక్టర్ల వల్ల ఏడాదికో, ఆర్నెళ్లో ఇబ్బంది వస్తే ఇంటర్నెట్ అసౌకర్యాలు ప్రతి నిమిషం మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ తాజా నిర్ణయం పూర్తి పరిష్కారం అనుకుంటే పొరపాటే.. ఇండియాలో ప్రధాన టెలికాం కంపెనీల నుంచి ఇంకా ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తించాలి. ఎయిర్ టెల్ జీరో వంటివే కాకుండా ఫేస్ బుక్, వాట్స్ యాప్ లతో రిలయన్స్ ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు చేసింది. 2012లో రిలయన్స్ వాట్స్ యాప్ ప్యాక్... 2013లో రిలయన్స్ ట్విట్టర్ ప్యాక్ లు వచ్చాయి. అలాగే ఎయిర్ సెల్ కూడా వికీపీడియాతో టై అప్ అయింది. దేశీయ కంపెనీ జెన్ ఫోన్లలోనూ ఇలాంటి యాప్ ఉంటుంది.. దాని సహాయంతో కొన్ని సైట్లను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి ప్యాక్ లు ఆయా మొబైల్ సేవల వినియోగదారులకు ఆ సైట్ల వినియోగాన్ని పెంచుతాయి. ఇకపై ఇలాంటివి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నెట్ న్యూట్రాలిటీ సాధన పోరాటం ఇంకా ముగియలేదని గుర్తించాలి.. ఫ్రీ బేసిక్స్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడారో నెట్ న్యూట్రాలిటీకి ఏ రూపంలో భంగం కలిగినా అంతేస్థాయిలో పోరాడాల్సిన అవసరం కనిపిస్తోంది.

-గరుడ
Tags:    

Similar News