తాత మరణంపై బోస్ మనమడు తేల్చేశాడు

Update: 2016-12-05 04:06 GMT
భారత స్వాతంత్ర్య సమరంలో దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంచటమే కాదు.. దేశానికి బానిస సంకెళ్లు తొలగించేందుకు వివిధ దేశాల మద్దతును కూడగట్టుకునే పని చేయటంతో పాటు..తెల్లోడి సర్కారుకు తన చేష్టలతో చుక్కలు చూపించిన సాహసి.. సుభాష్ చంద్రబోస్ గా చెప్పాలి. ఆయన మరణంపై నేటికీ వివాదం నెలకొని ఉంది. ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెప్పినా.. కానే కాదని.. ఆయన తర్వాతి కాలంలో బతికే ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగటమే కాదు.. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోల్ని తీసుకొస్తూ వాదనలు వినిపించే పరిస్థితి.

దీనిపై గడిచిన కొద్ది కాలంగా సందేహాలు వ్యక్తమవుతున్నా.. ఆయన మరణంపై ఈ మధ్యనే కేంద్రం కూడా స్పష్టత ఇస్తూ.. ఆయన విమాన ప్రమాదంలోనే మరణించినట్లుగా తేల్చింది. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనమడు.. పరిశోధకుడు ఆశిష్ రాయ్ కూడా ఇదే వాదనను వినిపించటమే కాదు.. అది నిజమని చెప్పే తిరుగులేని సాక్ష్యం తన దగ్గర ఉందని చెప్పటం గమనార్హం.

జపాన్ కు చెందిన రెండు నివేదికలు.. రష్యా ప్రభుత్వ ఆర్కైవ్స్ లో ఉన్న మరో నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన చెబుతున్నారు. జపాన్ లో తనకు రక్షణ లేదని భావించిన బస్.. భారతావనికి స్వాతంత్ర్యాన్ని ఇప్పించేందుకు వీలుగా రష్యా వెళ్లాలని ఆయనభావించినట్లుగా పేర్కొన్నారు. అయితే.. 1945లో కానీ.. ఆ తర్వాత కానీ నేతాజీ సోవియెట్  యూనియన్ లోకి ప్రవేశించినట్లుగా ఆధారాలు లేవన్నారు. నేతాజీ గల్లంతు భావోద్వేగానికి సంబందించిన అంశమన్నది తనకు తెలుసని.. కానీ వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయటం గమనార్హం. మొత్తంగా బోస్ మరణంపై ఆయన  మనమడి మాటలతో సందేహాలన్నీ తీరిపోయేలా ఉన్నాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News