బాబు..క‌మిట్ మెంట్ అంటే ఆ దేశ ప్ర‌ధానిలా ఉండాలి

Update: 2018-06-06 07:25 GMT
అత్యుత్త‌మ స్థానాల్లో ఉండే వారు చేసే ప‌నులు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అయితే.. అలాంటి తీరు త‌మ‌కు స‌హ‌జ సిద్ధంగా ఉంద‌న్న‌ట్లుగా ఉండాలే కానీ.. ఫోటోల కోసం వీడియోల కోసమైతే పేరు త‌ర్వాత అభాసుపాలు కావటం ఖాయం. త‌ర‌చూ త‌న తీరుతో ఇదే రీతిలో బుక్ అయ్యే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఒక దేశ ప్ర‌ధాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

ఊహించ‌నిరీతిలో జ‌రిగిన ఘ‌ట‌న విష‌యంలో ఆ దేశ ప్ర‌ధాని అనుస‌రించిన వైనాన్ని చూసైనా బాబు త‌న తీరును మార్చుకుంటే బాగుంటుంద‌ని చెబుతుంటారు. ఏదైనా ప‌ని చేసేట‌ప్పుడు ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌టం కోసం బాబు ప‌డే అవ‌స్థ ఆయ‌న‌పై ఉన్న అభిమానాన్ని.. గౌర‌వాన్ని త‌గ్గించేలా చేస్తుంది. ఎందుకిప్పుడు ఇదంతా చెబుతున్నారంటే.. నెద‌ర్లాండ్స్ ప్ర‌ధాని మార్క్ రూటే చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. దేశాల‌కు అతీతంగా ఆయ‌నంటే ఫిదా అయ్యేలా చేస్తుంది. ఇంత‌కూ ఆయ‌నేం చేశారంటే..

నెద‌ర్లాండ్స్ ప్ర‌ధాని మార్క్ త‌న ఆఫీసుకు వ‌చ్చే స‌మ‌యంలో కాఫీ క‌ప్పును ప‌ట్టుకొని వ‌స్తున్నారు. పొర‌పాటున ఆయ‌న చేతి నుంచి కాఫీ క‌ప్పు కింద ప‌డింది. దీంతో.. నేల మొత్తం ఖ‌రాబైంది.

ఇలాంటిదే మ‌రెవ‌రికైనా జ‌రిగితే.. వెంట‌నే ప‌నోళ్ల‌ను అలెర్ట్ చేసి.. శుభ్రం చేయాల‌ని కోర‌తారు. కానీ.. త‌న పొర‌పాటు కార‌ణంగా జ‌రిగిన ప‌నికి ప్ర‌ధాని మార్క్ మ‌రోలా రియాక్ట్ అయ్యారు. చేతిలో ఫైల్స్ ను ప‌క్క‌న పెట్టేసి.. అక్క‌డే శుభ్రం చేసే సిబ్బందిని పిలిచి.. వారి చేతిలోని మాప్ స్టిక్ ను ప‌ట్టుకొని తుడిచారు. ఏదో.. ఫోటోలు.. వీడియోల కోసం కాకుండా.. నిజాయితీగా శుభ్రం చేసే ప‌ని చేశారు.

అంతేనా.. ఫ్లోర్ శుభ్రం చేసే ప‌నిలో భాగంగా.. చేతిలో చిన్న క్లాత్ ముక్క‌ను తీసుకొని.. కాఫీ చుక్క‌లు ప‌డిన వ‌స్తువుల్ని శ్ర‌ద్ధ‌గా తుడ‌వ‌టం క‌నిపిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఉల్లాసంగా క‌నిపించిన ఆయ‌న తీరు ఇప్పుడు అంద‌రికి ఆస‌క్తిక‌రంగా మారింది. దేశ ప్ర‌ధానే స్వ‌యంగా మాప్ స్టిక్ తో ప్లోర్ ను శుభ్రం చేయ‌టంపై అక్క‌డి పారిశుద్ధ్య సిబ్బంది మురిసిపోయారు. ఇక‌.. ఆ దేశ పౌరులు ఇప్పుడు త‌మ ప్ర‌ధాని చేసిన ప‌నికి గ‌ర్విస్తున్నారు. క‌మిట్ మెంట్ తో చేస్తే ఎలా ఉంటుందో.. నెద‌ర్లాండ్ ప్ర‌ధానిని చూసి నేర్చుకోవాల‌ని.. వీడియోను చూసైనా బాబు త‌న‌ను తాను మార్చుకుంటే మంచిదిన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News