ఓటేసిన పాపానికి బైక్ నుంచి సైకిల్ దాకా తెచ్చారు? ఎడ్ల బండే మిగిలిందా?

Update: 2021-06-30 13:30 GMT
దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న వేళ.. వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ కొన్ని మెసేజ్ లు తరచూ కనిపించేవి. భరతమాత ముద్దు బిడ్డ మోడీ కానీ ప్రధానమంత్రి అయితే లీటరు పెట్రోల్ రూ.50 కంటే తక్కువ.. లీటరు డీజిల్ రూ.40 వరకు పడిపోతుందని.. రామరాజ్యం కంటి ముందుకు వచ్చేస్తుందని ఊరించేవారు.

ఇలాంటి ఉదరగొట్టు ప్రచారం దెబ్బకు ప్రధాని కుర్చీలో మోడీ కూర్చోవటం తెలిసిందే. ఒకసారి సరిపోనట్లు.. రెండోసారి కూడా పవర్ చేతికి ఇచ్చారు. అంతే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్.. డీజిల్ ధరలు పరుగులు తీయటం మొదలైంది. లీటరు పెట్రోల్ సెంచరీ దాటేయటమే కాదు.. లీటరు డీజిల్ వందకు కాస్త దూరానికి వచ్చేసింది. ఇలాంటివేళ.. ఓట్లు వేసిన వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మోడీ వీరాభిమానులు.. దేశం కోసం లీటరుపెట్రోల్ మీద ఒక పాతికో.. ముప్ఫైయో ఎక్కువ ఖర్చు చేస్తే ఆస్తులు తరిగిపోతాయా? అంటూ విచిత్రపు వాదనల్ని తెర మీదకు తెచ్చారు. దేశం కోసం అంతలా త్యాగం చేయాలన్నదే వారి ఉద్దేశం అయితే.. మోడీ వీర భక్తులంతా తమ ఆస్తుల్లో 70 శాతాన్ని తమ చుట్టుపక్కల వారికి పంచేస్తే పోలా?
అప్పుడులీటరు పెట్రోల్ రూ.100 ఏంది? రూ.200 అయినా పెద్ద సమస్య కాదు. ప్రతి విషయానికి దేశ భక్తి.. దేశం కోసం లాంటి మాటల్ని ఇష్టారాజ్యంగా వాడేస్తున్న వైనం జాతిజనులకు చిరాకు తెప్పిస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా బీజేపీ నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ఒంటికి కారం రాసినట్లుగా ఉంటున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ ను మీడియా వాళ్లు ఒక ప్రశ్న వేశారు. అదేమంటే.. పెట్రోల్ ధరలు అంతకంతకు మండిపోవటం మీద ఆయన్ను ప్రశ్నిస్తే.. ఆయనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ప్రజలు మోటారు వాహనాలకు బదులుగా సైకిళ్లు వాడాలని ఉచిత సలహా ఇచ్చిపారేశారు. పెట్రోల్ వాడకం తగ్గించుకునేలా ప్రజలు చిన్న చిన్న పనులకు బైకులకు బదులుగా సైకిళ్లను వాడితే సరిపోదా? అని ప్రశ్నించారు.

సైకిల్ వాడితే ఆరోగ్యంగా ఉండటమే కాదు కాలుష్యాన్ని నివారించినట్లు అవుతామంటూ చెబుతున్న సుద్దులు వింటే ఒళ్లు మండిపోవటం ఖాయం. ప్రజాధనాన్ని పప్పు బెల్లాల మాదిరి పంచి పెట్టటం.. నీళ్ల మాదిరి ఖర్చు చేసే ప్రజాప్రతినిధులకు.. ప్రజలు కట్టే పన్నులతో ఇచ్చే ఖరీదైన కార్లకు బదులుగా.. ఎడ్ల బండ్లు.. మంత్రులకు గుర్రపు బగ్గీలు ఇచ్చి.. అందులో తిరగమంటే సరిపోతుందేమో కదా? ఇప్పుడు సైకిల్ వాడమంటున్న నేతలు..రేపొద్దున బస్సులకు బదులుగా ఎడ్ల బండ్లు వాడమని చెప్పినా చెబుతారేమో? ఎంత ఓటేస్తే మాత్రం.. ప్రజలు మరీ ఇంత ఎటకారం అయిపోయారా?
Tags:    

Similar News