ఎందుకింత రచ్చ చేస్తున్నారు ?

Update: 2021-05-08 03:03 GMT
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విషయంలో ఎందుకింతగా రాద్దాంతం చేస్తున్నారో అర్ధం కావటంలేదు. సెకెండ్ వేవ్ ఉదృతి ఒక్క ఏపిలో మాత్రమే కాదు యావత్ దేశంమీద చాలా తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ విషయం కళ్ళకు కట్టినట్లు కనబడుతున్న సమయంలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు చంద్రబాబు నానా రచ్చ చేస్తున్నారు.

ప్రతిరోజు వైద్య నిపుణులతో సమావేశమనో లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశమనో, పార్టీ జనరల్ బాడీ సమావేశమని, మీడియా సమావేశమని ఏదో పేరుతో ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. ఒకవైపు కరోనా సంక్షోభంలో భయంతో జనాలు అల్లాడిపోతుంటే వాళ్ళని చంద్రబాబు మరింత భయపెట్టేస్తున్నారు. కరోనా వైరస్ తో కన్నా జనాలు నిజానికి భయంతోనే ఎక్కువమంది చనిపోతున్నట్లు వైద్య నిపుణులు, మానసిక వికాస నిపుణులు పదే పదే మొత్తుకుంటున్నారు.

ఆసుపత్రుల్లో బెడ్లు లేవని, ఆక్సిజన్ రోగులందరికీ అందటంలేదని, వైద్యసాయం అందంటం లేదంటు గోల పెట్టేస్తున్నారు. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటు విరుచుకుపడుతున్నారు. నిజానికి సమస్య వచ్చినంత తొందరగా పరిష్కారం రాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, కుంభమేళా లాంటి కారణాల వల్లే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయిందని నిపుణులు చెబుతున్నారు.  

కరోనా వైరస్ కారణంగానే ఏపిలో స్ధానికసంస్ధల ఎన్నికలు వాయిదా వేయాలని జగన్ పదే పదే చెప్పారు. అయినా అప్పటి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్+చంద్రబాబు+ఇతర ప్రతిపక్షాల నేతలు పట్టుబట్టి ఎన్నికలు జరిపించారు. ఇపుడేమో కరోనా ఉదృతిని నియంత్రించటంలో జగన్ ఫెయిలయ్యారంటు రోజు గోలచేస్తున్నారు. ఒక ఆసుప్రతిలో 100 పడకలు ఉన్నాయని అనుకుందాం. 100 మంది రోగులు వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. పోనీ 110 మంది వచ్చినా ఏదోలా ట్రీట్ చేస్తారు. కానీ ఒక్కసారిగా వెయ్యిమంది వచ్చేస్తే డాక్టర్ ఏమి చేయగలరు ?

ఇపుడు ఏపి మాత్రమే కాదు యావత్ దేశంలో పరిస్ధితులు ఇలాగే ఉన్నాయి. రోజువారి రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతున్న కారణంగానే ఆసుపత్రుల స్ధాయి సరిపోవటంలేదు. బెడ్లు, ఆక్సిజన్ లేదనే గోల ఇందులో నుండే పుట్టుకొచ్చింది. ఈ విషయాలన్నీ తెలిసికూడా కేవలం జగన్ను బద్నాం చేసి లబ్దిపొందాలన్న టార్గెట్ తప్ప చంద్రబాబు గోలలో ఇంకేమీ కనబడటంలేదు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయిన తర్వాత మాట్లాడుతు ’ప్రమాదాల్లో చనిపోతుంటారండి ఏమి చేస్తాం’ ? అంటు మీడియాను ఎదురు ప్రశ్నించిన చంద్రబాబు ఇపుడు ప్రభుత్వ నియంత్రణలో లేని సమస్యకు జగన్ను బాధ్యుణ్ణి చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

రోజు ఇంత గోల చేసేబదులు టీడీపీలో ఎందరో డాక్టర్లున్నారు. టీడీపీ మద్దతుదారుల్లో ఎందరో డాక్టర్లున్నారు. అలాంటి వాళ్ళని లేదా వాళ్ళ ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత వైద్యం ఇప్పిస్తే జనాలు మెచ్చుకుంటారు. కర్నూలులో కరోనా వైరస్ కన్నా 20 రెట్లు ప్రమాధకరమైన ఎన్ 440కే వేరియంట్ పుట్టుకొచ్చిందని నోటికొచ్చినట్లు పదే పదే చెప్పి జనాల్లో భయం పెంచటం తప్ప ఏమన్నా ఉపయోగముందా ?  ఆందోళనలో ఉన్న జనాలను మరింత భయపెడితే చంద్రబాబుకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నది వాస్తవం.
Tags:    

Similar News