వైసీపీలోకి అలీ!... జోకులు పేలిపోతున్నాయి!

Update: 2019-03-12 17:30 GMT
*న‌చ్చిన న‌గ‌కు ఎస్టిమేట్ స్లిప్స్ తీసుకోండి. మొబైల్ లో ఫొటో కూడా తీసుకోండి. రెండింటినీ పెట్టుకుని నాలుగైదు షోరూమ్స్‌లో కంపేర్ చేయండి. డ‌బ్బులు ఊరికే రావు* ఇది సినిమా డైలాగ్ ఎంత‌మాత్రం కాదు... గుండుబాస్‌ గా మ‌నకు బాగా ప‌రిచ‌య‌మైన ల‌లితా జ్యువెల్ల‌ర్స్ అధినేత కిర‌ణ్ కుమార్ మ‌న టీవీల్లో ప్ర‌త్య‌క్ష‌మై చెప్పే మాట‌. టీవీల్లోనే కాదు ఏ రోజు.. ఏ దిన‌ప‌త్రిక చూసినా గుండు బాస్ క‌నిపించేస్తున్నారు. ఇదే మాట‌ను చెప్పేస్తున్నారు. అయినా ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకంటే... ఇప్పుడు గుండు బాస్ మంత్రం రాజ‌కీయ నేత‌ల‌కూ ఎక్కేసింది. రాజ‌కీయ నేత‌లంటే... పాత‌కాల‌పు నేత‌లు కాదు... ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ క‌మోడియ‌న్ అలీని చూస్తే మాత్రం ఇప్పుడు గుండుబాస్ చెప్పిన డైలాగే మ‌న చెవుల్లో రివ్వుమంటోంది.

గుండుబాస్ త‌ర‌హాలోనే ఏపీలోని మూడు ప్రధాన పార్టీల‌తో మంత‌నాలు సాగించిన అలీ... చివ‌ర‌కు విప‌క్ష వైసీపీలో చేరిపోయారు. నిన్న ఆయ‌న లోట‌స్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోగానే... గుండు బాస్ చెప్పిన మాట‌ల‌ను, అలీ వ్య‌వ‌హ‌రించిన తీరును పోలుస్తూ... ఓ ప్ర‌ముఖ తెలుగు టీవీ ఛానెల్ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. ఇప్పుడు క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోగా... అలీ పొలిటిక‌ల్ ఎంట్రీపై జోకుల మీద జోకులు పేలిపోతున్నాయి. త‌న బిజినెస్‌ను విస్త‌రించుకునేంద‌కు గుండు బాస్ వినిపించిన మాటల త‌ర‌హాలోనే.. అలీ కూడా త‌న ల‌క్ష్యాల‌ను సాధించుకునేందుకు ఏ పార్టీ అయితే బాగుంటుంద‌న్న విష‌యాన్ని తేల్చుకునేందుకు ఏకంగా రాష్ట్రంలోని మూడు కీల‌క పార్టీల‌తో చెట్టాలేసుకుని తిరిగారు. తొలుత వైసీపీ అధినేత జ‌గ‌న్ తో భేటీ అయిన అలీ... ఆ త‌ర్వాత టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితోనే భేటీ అయ్యారు. చాలాకాలంగా టీడీపీతోనే కొన‌సాగుతూ వ‌స్తున్న అలీ... చంద్ర‌బాబుతో కీల‌కమైన ఎన్నిక‌ల‌కు ముందు ఏకంగా మూడు - నాలుగు సార్లు క‌లిశారు. ఆ త‌ర్వాత త‌న మిత్రుడు - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా క‌లిశారు. ఈ క్ర‌మంలో అలీ ఏ పార్టీలో చేర‌తార‌న్నఅంశంపై  పెద్ద ఎత్తున ఊహాగానాల‌కు తెర లేవ‌గా... అలీ మాత్రం నిన్న వైసీపీలో చేరిపోయారు.

ఈ క్ర‌మంలో అలీ... గుండు బాస్ చెప్పిన బాట‌లోనే ప‌య‌నించార‌న్న వాద‌న వినిపిస్తోంది. గుండు బాస్ చెప్పిన‌ట్టుగానే తొలుత వైసీపీ వ‌ద్దకు వెళ్లిన అలీ... అక్క‌డ త‌న‌కు ల‌భించే అవ‌కాశాల‌ను మ‌దిలో నిక్షిప్తం చేసుకుని... ఆ త‌ర్వాత టీడీపీ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డి అవ‌కాశాల‌ను కూడా మ‌న‌సులోనే పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత జ‌న‌సేన వ‌ద్ద‌కెళ్లి అక్క‌డి అవ‌కాశాల‌ను కూడా మ‌న‌సులోనే రాసిపెట్టుకున్నారు. అటుపైన ఆ మూడు అవ‌కాశాల‌ను బేరీజు వేసుకున్న అలీ... అన్నింటిలోకి వైసీపీనే బెట‌ర‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసి నిన్న లోట‌స్ పాండ్‌ కు చేరుకున్నార‌ని చెప్పుకోవాలి. ఇదే క్ర‌మాన్ని గుర్తు చేస్తూ ఆ టీవీ ఛానెల్ ప్ర‌సారం చేసిన గుండు బాస్ క‌థ‌తో అలీని పోలుస్తూ జోకులు పండించింది. ఈ వీడియో ఇప్పుడు నిజంగానే జ‌నాల్లోకి బాగానే వెళ్లిపోవ‌డంతో పాటు నిజ జీవితంలో కామెడీని పండిస్తున్న అలీ... రాజ‌కీయాల్లోనూ కామెడీ పీస్ అయిపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. 
Tags:    

Similar News