నువ్వు ఉండాల్సిన మంత్రివే నాయన.. వైసీపీ మంత్రిపై నెటిజన్ల సెటైర్లు!

Update: 2022-12-14 07:26 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసేవారిలో ఒకరు.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ నాథ్‌ ఒకరు. ఈ కారణంతోనే ఆయనకు జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని కేటాయించారని జనసేన శ్రేణులు ఆరోపించాయి. గుడివాడ అమర్‌ నాథ్‌ కూడా జనసేన విమర్శలకు తగ్గట్టే తాను ఉంది పవన్‌ కల్యాణ్‌ పై విమర్శలకే అన్నట్టు వ్యవహరిస్తుంటారు.

వాస్తవానికి గుడివాడ అమర్‌ నాథ్‌ కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో వివిధ ఐటీ కంపెనీలను, పరిశ్రమలను రప్పించి, వారితో పెట్టుబడులతో పెట్టిస్తే అమర్‌ నాథ్‌ కు మంచి పేరు వస్తుంది. అయితే ఆయన వాటిని గాలికొదిలేసి పవన్‌ కల్యాణ్‌ ను విమర్శించడానికే తాను మంత్రిని అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ పై ఆయన చేస్తున్న విమర్శలు గుడివాడ అమర్‌ నాథ్‌ కే బూమరాంగ్‌ అవుతున్నాయని అంటున్నారు. గతంలో పవన్‌ తో అమర్‌ నాథ్‌ దిగిన ఫొటోను ఒక టీవీ ఇంటర్వ్యూలో యాంకర్‌ ఆయనకు చూపితే.. పవన్‌ కల్యాణే తనతో ఫొటో దిగారని అమర్‌ నాథ్‌ వ్యాఖ్యానించారు. ఆ ఫొటో దిగినప్పుడు అమర్‌ నాథ్‌ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. దీంతో నెటిజన్లు, పవన్‌ అభిమానులు అమర్‌ నాథ్‌ ను సోషల్‌ మీడియాలో ఆడుకున్నారు.

ఆ తర్వాత మద్యనిషేధం చేస్తామని తామెక్కడా హామీ ఇచ్చామని.. తాము హామీ ఇవ్వలేదని.. ఇస్తే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చూపాలంటూ మీడియా సాక్షిగా వ్యాఖ్యానించి అడ్డంగా అమర్‌ నాథ్‌ దొరికిపోయారు. వైసీపీ మేనిఫెస్టోలో దశలవారీగా మద్యనిషేధం పెడతామని ఉన్న విషయం కూడా తెలియనివాడిని నువ్వేం మంత్రివి నాయనా అని అప్పుడే నెటిజన్లు అమర్‌ నాథ్‌ ను గట్టిగా తగులుకున్నారు, అయినా మంత్రి గారు మారలేదు.

తాజాగా పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దానికి వారాహి అని పేరు పెట్టారు. అయితే వారాహి వాహనం తయారీలో రవాణా శాఖ నిబంధనలు పాటించలేదని, ఆ వాహనానికి తెలంగాణలో అనుమతి ఇచ్చినా, ఆంధ్రాలో అనుమతి విషయం ఆలోచిస్తామని.. ఇక్కడ నిబంధనలు వేరుగా ఉంటాయని అమర్‌ నాథ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దీంతో గుడివాడ అమర్‌ నాథ్‌ మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికారు. రవాణా శాఖ నిబంధనలు రాష్ట్రానికి ఒక రకంగా ఉండవని, మోటారు వాహనాల చట్టం దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుందని.. ఇది కూడా తెలియని నువ్వేం మంత్రివి నాయనా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి కానీ ఇలా ప్రతి విషయంలో అడ్డంగా దొరికిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ కేబినెట్‌ లో నువ్వు ఉండాల్సినవాడివే అంటూ వెటకారం చేస్తున్నారు.

మరోవైపు వారాహి వాహనానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. దేశవ్యాప్తంగా దీంతో పర్యటించవచ్చని.. ఎలాంటి నిబంధనల అతిక్రమణ జరగలేదని తెలంగాణ రవాణా శాఖ సంచాలకులు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వారాహి వాహనానికి మిలటరీ వాహనాల రంగు ఆలివ్‌ గ్రీన్‌ వేశారని, ఏ రంగు కూడా వేయాలో తెలియని అజ్ఞాని పవన్‌ అని పేర్ని నాని, రోజా వంటి మంత్రులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే వారాహి వాహనానికి ఉంది ఆలివ్‌ గ్రీన్‌ కాదని తెలంగాణ రవాణా శాఖ తేల్చిచెప్పింది. నిబంధనల మేరకే ఉందని వెల్లడించింది. దీంతో వైసీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. అయితే అమర్‌ నాథ్‌ మాత్రం తెలంగాణలో ఒప్పుకున్నా ఆంధ్రాలో ఒప్పుకోబోమని మళ్లీ తన అజ్ఞానాన్ని చాటుకోవడంపై నెటిజన్లు గట్టిగానే ఆయనను సోషల్‌ మీడియాలో వేసుకుంటున్నారు.

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచార రథం వారాహి మీద అమర్‌నాథ్‌ అదే పనిగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ వాహన రూపకల్పనలో నిబంధనలు పాటించలేదని, దానికి రిజిస్ట్రేషన్‌ జరగదని.. వారాహిని ఆంధ్రా రోడ్ల మీద తిరగనివ్వమని వైసీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. కట్‌ చేస్తే తెలంగాణలో వారాహికి రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. దీంతో వైసీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఐతే తాజాగా ప్రెస్‌ మీట్లో దీని గురించి విలేకరులు అమర్‌నాథ్‌ ను అడిగితే.. ఆయన తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు.

తెలంగాణలో మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ ఎలా ఉన్నాయో తమకు తెలియదని.. ఏపీలో వస్తే మాత్రం ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా దానికి బ్రేక్‌ వేస్తామన్నట్లుగా అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించాడు. కానీ మోటార్‌ వెహికల్‌ చట్టం అన్నది దేశం మొత్తానికి ఒకే రకంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ విషయంలో ఒకే రకమైన నిబంధనలు పాటిస్తారు. మధ్యలో అమెరికాలో వాహనాలన్నీ కుడివైపు వెళ్తాయి.. ఇక్కడ ఎడమ వైపు అంటూ అమర్‌నాథ్‌ సంబంధం లేని లాజిక్‌ కూడా తేవడం గమనార్హం. దేశాల మధ్య పోలిక పెట్టి రాష్ట్రాల మధ్య మోటార్‌ వెహికల్‌ నిబంధనలు మారుతాయంటూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈయన ఒక మంత్రా అంటూ ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News