కిరాణా వ్యాపారం కోసం అంబానీ అంత ఖర్చు చేసేశారా?

Update: 2022-01-07 04:29 GMT
వ్యాపారం ఏదైనా సరే.. తన స్థాయికి ఏ మాత్రం తగ్గకూడదన్నట్లుగా వ్యవహరించటం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. అప్పట్లో కూరగాయలు.. కిరాణా షాపుల్ని పెడతానని ముకేశ్ చెప్పినప్పుడు.. అందరూ ఆశ్చర్యపోయారు. అంబానీ ఏమిటి? కిరాణా వ్యాపారం చేయటం ఏమిటని. కానీ.. ఈ రోజున పేరు మోసిన కంపెనీలు రిటైల్ బిజినెస్ లోకి రావటం తెలిసిందే. తాను షురూ చేసిన కిరాణా వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖేశ్ అంబానీ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇప్పటికే ఉన్న కిరాణా వ్యాపారానికి మరింత జోరు పెంచేందుకు ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫాం డంజోతో కలిసి పని చేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది. డంజోలో ఏకంగా25.8 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.1488 కోట్లు కావటం గమనార్హం. ఈ ఫండింగ్ రౌండ్ లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్ బాక్స్.. లైట్ త్రాక్.. 3ఎల్ క్యాపిటల్.. ఆల్టెరియా క్యాపిటల్ కూడా పాల్గొన్నాయి.

డంజోలో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో.. తమ జియో మార్ట్.. రిలయన్స్ రిటైల్ సేవల్ని మరింత వేగవంతంగా తీసుకెళ్లేందుకు సాయం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. డంజో ఇప్పటికే ఏడు మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవల్ని అందిస్తోంది. ఈ మధ్యనే డంజో.. డంజో డైలీ పేరుతో మరింత స్పీడ్ గా డెలివరీలు చేపడుతోంది. అంబానీ వ్యాపార ఐడియా చూస్తే అదిరిపోవాల్సిందే. వస్తువుల్ని అమ్మే షాపు తనదే.. డెలివరీ చేసే సంస్థా తనదే. మొత్తానికి లాభానికి అవకాశం ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ముఖేశ్ అంబానీ వదిలిపెట్టరన్న విషయం తాజా డీల్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.



Tags:    

Similar News