అనువుగాని చోట.. ఈ ఆవేశం అవసరమా బాబు?

Update: 2022-01-07 13:30 GMT
‘అనువుగాని చోట అధికులమనరాదు..’ మిలియనీయం తర్వాత పుట్టిన వారికి ఈ మాటకు అర్థం పెద్దగా తెలీకపోవచ్చుకానీ.. ఏనభైల వరకు పుట్టినోళ్లకు దీని అర్థం బాగానే తెలుస్తుంది.మనకు బలం లేని చోటకు వెళ్లి తమకు మించిన తోపులు ఉండరన్నట్లుగా వ్యవహరించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. అన్ని తెలిసిన చంద్రబాబు.. మరి ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారన్నది పెద్ద ప్రశ్న. తనకు తిరుగులేని బలమున్న కుప్పం నియోజకవర్గంలో ఇటీవల మారిన పరిణామాల గురించి తెలిసిందే. చంద్రబాబుకు.. ఆయన పార్టీకి కంచుకోట లాంటి కుప్పంలో ఏపీ అధికారపక్షం వైసీపీ పాగా వేయటం.. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లోనూ.. ఈ మధ్యన జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ బాబుకు షాకుల మీద షాకులు ఇస్తున్న వైనం తెలిసిందే.

అన్నింటికి మించి.. ఈ మధ్యన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు దారుణంగా ఓటమిపాలు కావటం.. మున్సిపాలిటీ మీద వైసీపీ జెండా ఎగరవటానికి మించిన ఎదురుదెబ్బ బాబుకు మరొకటి లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కుప్పం పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. పలువురి మీద ఆయన విరుచుకుపడిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో 22 ఏళ్లుగా తిరుగులేని స్థానంలో ఉన్న వేళ.. మారిన పరిస్థితులపై తీవ్ర ఆవేశాన్ని.. అంతకు మించిన ఆగ్రహాన్ని ప్రదర్శించిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యవహరించాల్సిందే తప్పించి.. అనవసర ఆవేశానికి పోయి.. ఉన్న బలాన్ని తగ్గించుకునేలా వ్యవహరించటం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నది ప్రశ్న. కుప్పం పర్యటనలో పలువురిని ఉద్దేశించి.. వెయ్యికి.. రెండువేల రూపాయిలకు అమ్ముడుపోతారా? అని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.

తనకు విలువలు ముఖ్యమని.. డబ్బులకుఅమ్ముడబోయి తప్పు చేశారని వ్యాఖ్యానించటం బాబుకు ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అయ్యో.. మన నాయకుడికి ఎంతటి అవమానం మిగిల్చామన్న భావన ప్రజల్లో కలిగేలా చేయాలే తప్పించి.. అందుకు భిన్నమైన భావన కలగకూడదు. తాజాగా.. చంద్రబాబు మాటలు మాత్రం కోపాన్ని కలిగించేలా ఉన్నాయని చెబుతున్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని.. ఎవరినీ వదలనంటూ ఆగ్రహం వ్యక్తంచేయటంఅవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన ఆవేశం ఏ మాత్రం మంచిది కాదని.. చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తించటం లేదన్నమాట కొందరు నేతల నోటి నుంచి రావటం గమనార్హం.


Tags:    

Similar News