జేడీ సారూ...ఏంటిది మాస్టారూ..?

Update: 2022-01-03 09:30 GMT
జేడీ లక్ష్మీ నారాయణ అంటే మేధావిగానే సమాజం చూస్తొంది. ఆయన ఐపీఎస్ అధికారి, సమర్ధుడు, వృత్తిపరంగా నిబద్ధత కలిగిన వారు. అలాంటి జేడీ కులమేంటో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. కానీ జేడీ మాత్రం తనకు తానే చెప్పేసుకున్నారు. ఆయన కూడా కులం కంపులోకి రొచ్చులోకి దిగిపోయారు. నిజానికి కులం అంటే కుత్సితం అని పెద్దలు చెబుతారు. మతం అంటే మారణహోమం అని కూడా వివేచనాపరులు హెచ్చరిస్తారు.

చదువు అన్నది ఎంత పెరిగితే అంతలా ఈ కులాల మతలా కట్టుబాట్లను, భ్రమలను తెంచుకుని అందరినీ పంచుకుంటూ ముందుకు సాగుతారు, సాగాలీ అన్నది కూడా పెద్దలు చెప్పే మాట. మరి ఆధునిక కాలంలో ఎంత చదువుకున్న వారు అయినా కులం, మతం అడ్డుగోడలను దాటలేకపోతున్నారు. ఎవరో కుర్ర కారు, యువత కులం గొప్పలు చెప్పుకుంటే తప్పు అనాల్సి ఉంటుంది. అలాంటిది అన్నీ తెలిసి పామరులను సరిచేయాల్సిన మేధావులు కూడా కులం రొంపిలోకి వేయి అడుగుల లోతు దిగబడిపోవడాన్ని ఏ విధంగా చూడాలి.

మరో వేయేళ్లు గడచినా ఈ కులాల మురికి కంపు పోదని కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసి చెప్పాలేమో. ఇదంతా ఎందుకు అంటే మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ విషయం చెప్పుకునేందుకే. జేడీ ఈ మధ్య ఆయన కూడా తన కుల సమావేశానికి అటెండ్ అయి తానేంటో చెప్పేసుకున్నారు అని సెటైర్లు అయితే పడుతున్నాయి. జేడీ అందరివాడు అని సమాజం చూసింది. అయితే తాను కొందరి వాడినేనని ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లు, ఒప్పేస్తుకున్నట్లు అయింది.

లేటెస్ట్ గా జరిగిన కాపు కుల పెద్దల సమావేశానికి జేడీ హాజరు కావడాన్ని మేధావుల నుంచి వివేచనాపరుల వరకూ తప్పు పడుతున్నారు. మీరూ ఆ తానులో ముక్కేనా సారూ అని దీర్ఘాలు తీస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నాయి. నిజానికి జేడీ ఒక అధికారిగా సక్సెస్ ఫుల్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి వెలుగు బాట చూపాలనుకున్నారు. మంచి ఆశయాలను కూడా ఆయన ప్రవచించారు. ఇంతా చేసిన జేడీ ఒక పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగానే కులం గుర్తు తెచ్చుకుని నాలిక్కరచుకుని అదే తమకు దిక్కు అన్నట్లుగా మారిపోతే ఎలా మాస్టారూ అనే విమర్శలు వస్తున్నాయి.

కులం, మతం చిచ్చులో పడి నలుగుతున్న యువతకు సందేశం ఇచ్చి వారిని ఉన్నత భావల దిశగా నడిపించాల్సిన వారిలో జేడీని కూడా చెప్పుకుంటారు. ఆయనకే ఈ బాధ్యత ఉందా అని ఎవరైనా అనుకోవచ్చు. అయితే ఆయన ప్రవచించిన నైతిక సూత్రాలు, విలువలు అన్నీ కూడా అవే కాబట్టి ఆయన మీద సమాజం ఆ ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఆయనే కుల సమావేశాలకు హాజరైతే మరి ఏం చేయాలి అన్నదే చర్చగా ఉంది.

మొత్తానికి రాజకీయాల్లో రాణించాలి అంటే దగ్గర దారి కులం మతం అనే జేడీ లాంటి మేధావులే గ్రహించారా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో మార్పు ఇక రాదు అని కూడా భావిస్తున్నారా అని కూడా ఆలోచించాలి. మొత్తానికి జేడీ వంటి వారు ఇలా కులం రొంపిలో చిక్కుకుపోవడం చూసిన వారు మాత్రం ఎవరైనా అతీతం కారా అన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి జనాలు తన మీద పెట్టుకున్న ఆశలను చూసి జేడీ ఇకనైనా కులాలకు అతీతంగా వ్యవహరిస్తారని ఆశించవచ్చా. ఏమో చూడాలి మరి.


Tags:    

Similar News