సండే వేళ.. సారుకు ఈ రివ్యూల మూడ్ ఏందో?

Update: 2022-01-10 05:35 GMT
దేశంలో ముఖ్యమంత్రులు ఎందరున్నా.. సచివాలయానికి వెళ్లకుండా ఏళ్లకు ఏళ్లు పాలన సాగించే ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పొచ్చు. అయినా.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే.. అదే సచివాలయం అంటూ సరికొత్త సూత్రీకరణ చేసిన ఆయన.. తనపై వచ్చే విమర్శల్ని అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ లో ఉంటారో? ఎప్పుడు ఫాంహౌస్ (కేసీఆర్ భాషలో ఫార్మర్ హౌస్) లో ఉంటారోతెలియని పరిస్థితి. మిగిలిన రోజుల్లో ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాదు.

గతంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏమిటన్న విషయాన్నిసచివాలయంలోప్రముఖంగా ప్రదర్శించే వారు. ఆ మాటకు వస్తే.. సీఎంగారి షెడ్యూల్ ఫలానా అని.. ఒక రోజు ముందే పెట్టేసేవారు. దాని ఆధారంగా తర్వాతి రోజు ఏమేం రివ్యూల్ని చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అలాంటి వాటిని వదిలేసిన కేసీఆర్.. తనదైన కొత్త నిబంధనల్ని తీసుకొచ్చేయటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విడి రోజుల సంగతి ఎలా ఉన్నా.. అధికారులకు సెలవు రోజైన ఆదివారం వేళ.. వరుస పెట్టి రివ్యూల్ని నిర్వహించే విషయంలో కేసీఆర్ ట్రాక్ రికార్డు ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంత ముఖ్యమంత్రి అయినప్పటికీ.. తన గురించి కాకుండా తన తోటి వారి గురించి కాస్త ఆలోచించాలి కదా? ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం అంటే.. కనీసం వందల్లో సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. వారందరి కుటుంబాలు సెలవు రోజున.. ఇంటి పెద్ద లేని పరిస్థితి. వారంలోనూ పనే.. వారాంతంలోనూ పనే అన్నది ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.

రివ్యూలు చేయాల్సిందే. కానీ.. తన సమీక్షలు.. తన వద్ద పని చేసే సిబ్బందికి షాకింగ్ గా మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఆదివారం సీఎం కేసీఆర్ షెడ్యూల్ చూస్తే.. ఆయన వరుస పెట్టి రివ్యూల్ని నిర్వహించారు. దీంతో.. వర్కింగ్ డే వేళ ఎంత బిజీగా ఉంటారో..అంతకు మించిన హడావుడి ప్రగతిభవన్ లో నెలకొంది. ఒక సిస్టం ప్రకారం పని చేయాల్సిందిపోయి.. ముఖ్యమంత్రి వారికి ఎప్పుడు మూడ్ వస్తే..అప్పుడు రివ్యూల్నినిర్వహించటం ఇబ్బందికరమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించాలని కోరుకుంటున్నారు. మరి.. ఆయన చెవిలో వేసే సాహసం ఎవరు చేయగలరు?


Tags:    

Similar News