ముద్రగడ గర్జన విన్నారా... మూడొచ్చినట్లే... ?

Update: 2022-01-04 08:41 GMT
ముద్రగడ పద్మనాభం అంటే చాలు తెలుగు జనాలకు ఆయన ఎవరు ఏంటి అన్నది అర్ధమైపోతుంది. ఆయన పేరుకు ముందు మాజీ మంత్రి, మాజీ ఎంపీ అని ఇత్యాది ట్యాగ్స్ తగిలించాల్సిన అవసరం లేదు. ఇక కాపు నాయకుడు అని ప్రత్యేకించి చెప్పాల్సినది కూడా లేదు. ఆయనది ముప్పయ్యేళ్ళ పైబైడిన కాపు పోరాటం. ఫలితం సంగతి పక్కన పెడితే ముద్రగడ అంటే కేరాఫ్ కాపులు అన్న ఐకాన్ ట్యాగ్ అయితే కచ్చితంగా ఉంటుంది.

ముద్రగడ గత అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో ఆయన్ని గుక్కతిప్పుకోనీయకుండా చేశారు. ఆయన్ని ముప్పతిప్పలు పెట్టారు. కాపులను బీసీలో చేరుస్తారా లేదా అంటూ గట్టిగా ఆయన చేసిన సౌండ్ తో ఏపీలో రాజకీయ పరిణామాలు టోటల్ గా మారిపోయాయి. అవి ఎంతదాకా వచ్చాయి అంటే గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోటలు అని చెబుతారు. చివరికి అక్కడే 2019 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 34 సీట్లకు గానూ ఆరంటే ఆరు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక జగన్ ఏలుబడిలో కూడా కొత్తల్లో కాపులను బీసీల్లో చేర్చమని ఒక లేఖాస్త్రాన్ని ప్రయోగించిన ముద్రగడ ఆ తరువాత ఆ స్లోగన్ని పక్కన పెట్టేశారు. కొన్నాళ్ళకు కాపు ఉద్యమం నుంచి కూడా తప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. మరి ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న ఆయన ఇపుడు సడెన్ గా రాజకీయ తెర మీదకు వచ్చేశారు. కాపులు, బీసీలు, దళితులు అంటూ ఆయన సరికొత్త రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటూ ముద్రగడ ఇపుడు డిమాండ్ చేస్తున్నారు.

ఈ మధ్యనే ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఒక దఫా చర్చలు జరిపిన ముద్రగడ ఇపుడు ఒక బహిరంగ లేఖాస్త్రాన్నే సంధించారు. ఎన్నాళ్ళని అగ్ర కులాలకు పల్లకీ మోత మోస్తాము, ఎప్పటికీ బోయీలుగానే జీవితాలు గడపాలా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా కాపులు,దళితులు, బీసీలు అడుగులు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. దీని కోసం ఒక బ్లూ ప్రింట్ ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

మొత్తానికి ఏపీలో మూడవ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ముద్రగడ చురుకుగా పావులు కదుపుతున్నారని అర్ధమవుతోంది. ఇప్పటిదాకా కాపుల కోసమే ఉద్యమించిన ఆయన ఇపుడు బీసీలు, దళితులను కలుపుకుని బహుజనులతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా గట్టిగానే దృష్టి పెట్టారని అంటున్నారు.

జనాభా పరంగా నూటికి ఎనభై శాతం ఉన్న బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని ముద్రగడ స్లోగన్ గా ఉంది. ఈ విషయంలో ఆయన ముందుండి నడిపించడానికి కీలకమైన పాత్ర పోషించడానికి కూడా రెడీ అవుతున్నారని తెలుసొతోంది. మరి ఏపీలో టీడీపీ, వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇంకో వైపు జనసేన బీజేపీ కూటమి ఉంది. ఈ టైమ్ లో బహుజనుల పార్టీ వస్తే ఎలా ఉంటుంది అన్నదే రాజకీయాల్లో చర్చగా ఉంది.

ఏపీలో తమ రాజకీయ వాటా తేల్చుకోవడానికి ఈ వర్గాలు కనుక ఏకం అయితే సంకుల సమరం పీక్స్ లో ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీఎ విజయావకాశాలను చేటు చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఇంకో వైపు ప్రధాన రాజకీయ పార్టీలను తోసిరాజని మూడవ కూటమి అధికారం కైవశం చేసుకోగలదా అన్నది కూడా చూడాలి. ముద్రగడ వంటి పట్టుదల కలిగిన నాయకుడు నేతృత్వం వహిస్తే దాన్ని ఆషామాషీగా చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ముద్రగడ రగడ ఏపీ రాజకీయాల్లో సమీకరణను మొత్తంగా మార్చేస్తుంది అనడంలో సందేహమే లేదు అంటున్నారు.
Tags:    

Similar News