ఎన్నిక‌ల దాకా సాగ‌దీస్తారా?

Update: 2021-12-24 12:30 GMT
అధికారంలో ఉండే రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌య్యాయి. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో అధికారం ద‌క్కించుకోవ‌డం అంతిమ ల‌క్ష్యంగా పార్టీలు సాగుతున్నాయి. అందుకు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ణంగా పెట్టి త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డేలా వాటిని సుదీర్ఘ కాలం సాగ‌దీస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల అంశం కూడా అలాంటిదే. ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌ను స‌కాలంలో అమ్ముకోలేక‌.. అప్పులు తీర్చ‌లేక‌.. అన్న‌దాతలు ప్రాణాలు విడుస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇలు తెలంగాణ ప్ర‌భుత్వం.. అటు కేంద్ర ప్ర‌భుత్వం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.

మాట‌ల‌తోనే..

తెలంగాణ‌లో ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో వ‌ర్ష‌కాల‌పు కోటాను పెంచాల‌ని, యాసంగిలో పండే ప్ర‌తి గింజ‌ను కోనుగోలు చేయాల‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కోరుతోంది. కేంద్రమే ధాన్యాన్ని కొన‌న‌ని చెప్తోంద‌ని విమ‌ర్శ‌లు చేస్తోంది. ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు కూడా చేసింది. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం టీఆర్ఎస్ అస‌త్య ప్ర‌చారం చేస్తుంద‌ని చెప్తోంది. ముడి బియ్యాన్ని ఎంతైనా కొనుగోలు చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్తున్న‌ప్పటికీ బియ్యాన్ని సేక‌రించ‌డం లేద‌ని కేసీఆర్ స‌ర్కారు అబ‌ద్దాలు చెప్తుంద‌ని కేంద్ర మంత్రులు అంటున్నారు. మోడీ ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా ఉంటుంద‌ని, వాళ్ల త‌ర‌పున తెలంగాణ ప్ర‌భుత్వంతో పోరాడుతుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇలా ఒక‌రిపై ఒక‌రు కొనుగోళ్ల బాధ్య‌త‌లు తోసేసుకుంటూ రైతు క‌డుపు కొడుతున్నారు.

ఇంకా ఎన్నాళ్లూ..

ఈ వ‌రి కొనుగోళ్ల విషయం ఇప్ప‌టికే నెల‌ల పాటు నానుతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్లు దీన్ని లాగుతారు అనే అస‌హ‌నం ప్ర‌జ‌ల్లో పెరిగిపోతుంది. రైతులు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు స‌త్వ‌ర‌మే ఓ నిర్ణ‌యం తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నాయ‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ‌లో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ఊహాగానాలే అందుకు కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యాన్ని సాగ‌దీసి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందాల‌ని ఇటు టీఆర్ఎస్‌, అటు బీజేపీ అనుకుంటున్నాయ‌ని టాక్‌. ఇప్ప‌టికే రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవ‌డాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుకే కేంద్రంపై పోరుబాట ప‌ట్టారు. ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే అప్పుడు కేంద్రం తీరును త‌ప్పుప‌ట్టి ప్ర‌జ‌ల ఓట్ల‌ను రాబ‌ట్టాల‌ని చూస్తున్నార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ‌లో అధికారం కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్న బీజేపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ధాన్యం సేక‌ర‌ణ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే మాట‌తో ప్ర‌జ‌లను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తోంద‌ని నిపుణులు అంటున్నారు. ఇలా ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన ఆ రెండు పార్టీల త‌మ రాజ‌కీయ ఆట‌లో రైతుల‌ను పావులు చేస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


Tags:    

Similar News