టీమిండియా ఓటమి.. ఐపీఎల్ ను తిడుతున్నారు

Update: 2021-11-01 23:30 GMT
ప్రపంచకప్ టీ20లో ఎన్నడూ లేనంత ఘోరంగా టీమిండియా ఆడుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు ఇండియాను దుమ్మెత్తిపోశారు. తాజాగా న్యూజిలాండ్ చేతిలో చిత్తు అయ్యి ప్రపంచకప్ సెమీస్ ఆశలు క్లిష్టం చేసుకోవడంతో తిట్టిపోస్తున్నారు. టీమిండియా ఓటమికి ఐపీఎల్ కారణమని ఆరోపిస్తున్నారు.

నిజానికి ఐపీఎల్ ద్వారా పదుల సంఖ్యలో ప్రతిభావంతులు టీమిండియాకు దొరికారు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరిస్ ను మెయిన్ టీంతో ఆడిన టీమిండియా.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో టీంను శ్రీలంకకు పంపి అక్కడ జట్టును ఓడించేసింది. 20 మంది ఆటగాళ్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారంటే మన జట్టు ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని ఏ జట్టుకు ఇంత మంది స్టాండ్ బై ఆటగాళ్లు లేరు. అంతగా ఐపీఎల్ యే ప్రతిభావంతులను ఐపీఎల్ వెలుగులోకి తీసుకొచ్చింది.

నిజానికి ప్రపంచ క్రికెట్ మేధావులు అంతా భారత జట్టు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఐపీఎల్ కారణమని కీర్తిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఐపీఎల్ అంటున్నారు.

జస్ప్రీత్ బుమ్రా నుంచి వరుణ్ చక్రవర్తి వరకూ టీమిండియాకు ఎంతో మంది ఆణిముత్యాలు దొరికారు. భారత్ క్రికెట్ కు ఐపీఎల్ ఎంతో మేలు చేసింది. అయితే తాజాగా ప్రపంచకప్ లో టీమిండియా ఓటమి తర్వాత పొగిడిన నోళ్లే తిడుతున్నారు. మనోళ్లు అంతా ఐపీఎల్ మత్తులో ఉండి గుడ్డిగా ఆడేశారని.. ఐపీఎల్ ప్రాంచైజీల కోసం డబ్బు కోసం ఆడుతున్నారే కానీ.. దేశం కోసం ఆడడం లేదని విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే 'బ్యాన్ ఐపీఎల్' అంటూ సోషల్ మీడియా అభిమానులు ట్రెండింగ్ మొదలు పెట్టారు. ఐపీఎల్ వల్లే టీమిండియా క్రికెటర్లు ఓడిపోయారని.. దాన్ని నిషేధించాలని నినదిస్తున్నారు. కానీ ఐపీఎల్ వల్ల భారత జట్టు ఇంత బలంగా తయారయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News