మా రాజకీయాలు అంతే.. నో కామెంట్స్ ప్లీజ్

Update: 2021-03-17 08:32 GMT
రాజ‌కీయ పార్టీ ఆఖ‌రి మెట్టు అధికారమైతే.. దానికి మొద‌టి మెట్టు ఎన్నిక‌ల్లో గెలుపు. దీనికోసం పార్టీలు ఏమైనా చేస్తాయి. పొత్తులు పెట్టుకోవ‌డం నుంచి ఓట‌ర్ల‌పై హామీలు గుమ్మ‌రించ‌డం వ‌ర‌కూ అన్నీ చేస్తాయి. అయితే.. ఇది దేశం మొత్తం సాధార‌ణ‌మే అయినా.. త‌మిళ‌నాట మాత్రం అసాధార‌ణం! మా క‌థే వేరుగా ఉంట‌ద‌ని చాటిచెప్తుంటాయి అక్క‌డి రాజ‌కీయ పార్టీలు. దానికి ప‌రాకాష్ట ఎన్నిక‌ల వేళ ఇచ్చే హామీలు!

త‌మిళ రాజ‌కీయ పార్టీలు ఇచ్చే ఎన్నిక‌ల హామీలు గ‌న‌క‌ ప‌రిశీలిస్తే.. ఇలాంటి వాగ్ధానాలు కూడా చేస్తారా? అని అనిపించ‌క మాన‌దు! ఇది ఇప్పుడు మొద‌ల‌య్యింది కాదు.. ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న ‘సంప్ర‌దాయం’. తాజా ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ వాగ్ధానాల మోత మోగుతోంది. హామీల వ‌ర్షం కురుస్తోంది. ఆ జ‌డిలో త‌మిళ ఓట‌ర్లు త‌డిసి ముద్దైపోతున్నారు.

అన్నాడీఎంకే ప్ర‌స్తుతం రెందో ద‌ఫా అధికారంలో కొన‌సాగుతోంది. ఈ సారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. కానీ.. ప్రీ పోల్ స‌ర్వేల్ మాత్రం మూకుమ్మ‌డిగా డీఎంకేకు ప‌ట్టం క‌ట్టేశాయి. దీంతో.. ఎలాగైనా అధికారం కొన‌సాగించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న ఆ పార్టీ చిత్ర విచిత్ర‌మైన హామీలను కుమ్మ‌రిస్తోంది.

అమ్మ వాషింగ్ మిష‌న్ అంటూ ఇంటింటికీ ఓ బ‌ట్ట‌లు ఉతికే మిష‌న్ కొని ప‌డేస్తార‌ట‌. సోలార్ స్ట‌వ్ లు, కేబుల్ టీవీలు ఇచ్చేస్తార‌ట‌. మ‌హిళ‌ల‌కు ప్ర‌యాణ ఛార్జీల్లో రా‌యితీలు, ఇంటికో ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చేసి, విద్య‌కోసం తీసుకున్న రుణాలు మాఫీ చేసేస్తార‌ట‌. ఇంకా.. ఎంజీఆర్ గ్రీన్ ఆటో, అమ్మ హౌసింగ్ స్కీమ్ అంటూ ఓ చాంతాడంత లిస్టు ప్రిపేర్ చేసింది అన్నాడీఎంకే పార్టీ.

మ‌రి, ఇంత జ‌రుగుతుంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, రేపు అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తంచేస్తున్న డీఎంకే మౌనంగా ఎలా ఉంటుంది? త‌మ‌దైన శైలిలో ఆల్ ఫ్రీ ప‌థ‌కాల‌ను అనౌన్స్ చేసింది. లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ల‌కు రూ.5 రిబేట్ ఇస్తామ‌ని, గ్యాస్ సిలిండ‌ర్ పై రూ.100 త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించింది. కొవిడ్ బాధిత వైట్ కార్డ్ హోల్డ‌ర్ల‌కు రూ.4 వేల సాయం, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిల‌ల‌కు 40 శాతం రిజ‌ర్వేష‌న్లు, సిటీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం వంటి హామీలు గుప్పించింది. ఇంత‌టితో ఆగ‌కుండా.. మ‌రో విచిత్ర‌మైన హామీని కూడా ప్ర‌క‌టించింది. హిందూ దేవాల‌యాల సంద‌ర్శ‌న‌కు టూర్ వెళ్లే వారికి రూ.25 వేల నుంచి రూ.ల‌క్ష వ‌ర‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఇందులో ఎన్ని అమ‌ల‌వుతాయ‌ని అడ‌గ‌కండి. ఎందుకంటే.. వాళ్ల‌క్కూడా తెలియ‌దు. ముందుగా జ‌నాన్ని ఆక‌ట్టుకోవాలి, నాలుగు ఓట్లు రాబ‌ట్టుకోవాలి కాబ‌ట్టి.. ఏది ఆక‌ర్ష‌ణీయంగా ఉంటే దాన్ని ప్ర‌క‌టించేస్తారు. గ‌తంలో జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి హ‌యాంలోనూ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఫ్రీ అంటూ ఎన్నో ప్ర‌క‌టించా‌రు. అవ‌న్నీ పేప‌రు మీద ప‌క్కాగా ఉంటాయి. అమ‌ల్లోకి ఎన్ని వ‌స్తాయ‌న్న‌ది ఎవ్వ‌రూ చెప్ప‌లేరు.

ఈ విష‌య‌మై త‌మిళ‌నాడులోని విద్యావంతులు, యువ‌త సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక్క‌డ రాజ‌కీయం ఇంతే.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నేత‌లు మాత్రం ఇవేవీ వినిపించుకునే కండీష‌న్లో లేరు. వాళ్ల దృష్టి మొత్తం అధికార పీఠంపైనే ఫోక‌స్ అయ్యి ఉంది. మ‌రి, ప్ర‌జ‌లు వేటిని న‌మ్ముతారో? ఎవ‌రికి ప‌ట్టం క‌డుతారో? చూడాలి.
Tags:    

Similar News