టోర్న్ జీన్స్’ సీఎం.. బీకాంలో ఫిజిక్స్ టైపేనా?

Update: 2021-03-22 01:03 GMT
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవలే సీనియర్ ను దించేసి ఈ జూనియర్ ను సీఎంను చేసింది కేంద్రంలోని బీజేపీ అధిష్టానం. ఆయన గారి ప్రతిభా పాఠవాలు తాజాగా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ఇటీవలే ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విలువలు పోతున్నాయని.. మహిళలతో సహా యువకులు మోకాళ్ల వరకు కనిపించేలా జీన్స్ (టోర్న్ జీన్స్) ధరించి  ఈ రోజుల్లో వింత ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించాడు.  ఒక ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో ఇది పెద్దదుమారం రేపింది. టోర్న్ జీన్స్ వేసుకోవడంపై విమర్శలు చేసిన తీరథ్.. ఆ తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. ‘మన దేశాన్ని 200 ఏళ్ల పాటు ఏలిన అమెరికా సైతం ఇవాళ కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది.’ అంటూ తీరథ్ చేసిన వ్యాఖ్యలు ఆయన పరువు తీశాయంటున్నారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

‘మా చరిత్ర పుస్తకాల్లో ఇదెక్కడా లేదే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  మనదేశాన్ని బ్రిటీష్ వారు పాలించారని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. కానీ మన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ మాత్రం అమెరికా వాళ్లు మనల్ని పాలించారని అనడం దుమారం రేపింది. ఆయన ‘బీకాంలో ఫిజిక్స్ ’ టైపా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ మాత్రం తెలియనది సీఎం ఎలా అయ్యారని దెప్పిపొడుస్తున్నారు.
Tags:    

Similar News