రైళ్ల‌పై ముష్టి నిర్ణ‌యాన్ని తీసుకోబోతున్నారా?

Update: 2018-03-06 04:38 GMT
మోడీ స‌ర్కారు కేంద్రంలో కొలువు తీరిన వెంట‌నే మార్పు వ‌చ్చేస్తాయ‌ని భావించిన మూడు ముఖ్య‌మైన అంశాల్లో ఒక‌టి రైల్వేలు. రైల్వేల స‌మూల ప్రక్షాళ‌న‌తో పాటు.. రైల్వేల‌కు సంబంధించి విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటాయ‌ని.. కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో పాటు.. పెద్ద ఎత్తున కొత్త రైళ్ల‌ను తీసుకొస్తార‌న్న అంచ‌నాలు వినిపించాయి.

అయితే.. ఈ అంచ‌నాల‌న్నీ ప‌క్క‌కి పోవ‌ట‌మే కాదు.. ప్ర‌తి ఏటా రైల్వేల‌కు పెట్టే బ‌డ్జెట్ విధానాన్ని ఎత్తిపారేశారు. దీంతో.. రైల్వేల‌కున్న ప్రాధాన్య‌త‌తో పాటు.. అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితిని తీసుకొచ్చారు. యూపీఏ హ‌యాంలో కొత్త రైళ్ల‌ను ప్ర‌క‌టించారే కానీ.. ప్రాక్టిక‌ల్ గా తీసుకురాలేద‌ని.. వాట‌న్నింటిని క్లియ‌ర్ చేయ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారే త‌ప్పించి.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోలేదు.

దీంతో పాటు.. ఛార్జీల వాయింపు మొద‌లు.. రాయితీల విష‌యం వ‌ర‌కూ కోత వేసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాలో అన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగిపోయాయి. గ‌తంలో మాదిరే కొన్ని రైళ్లు ఆల‌స్యంగా న‌డ‌వ‌టం.. న‌ష్టాల్లో కొన‌సాగ‌టం లాంటివి ఇప్ప‌టికీ సాగిపోతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రైల్వేల్ని మ‌రింత మార్చేందుకు రైల్వే బోర్డు ఒక క‌మిటీని నియ‌మించింది.

దీని ప‌నేమిటంటే.. రైల్వేల‌కు కొత్త శ‌క్తిని ఇచ్చేందుకు ఐడియాలు ఇవ్వ‌టం. దీనికి వారు ఇచ్చిన ఐడియాలు వింటే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. రైల్వేల్ని బాగు చేయ‌టానికి క‌మిటీ ఇచ్చిన సూచ‌న‌లు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీని ప్ర‌కారం స్టేష‌న్ల‌లో రైళ్లు ఆగే టైంను బాగా త‌గ్గించాల‌న్న‌ది ఒక‌టైతే.. బోగీల సామ‌ర్థ్యం కంటే త‌క్కువ‌గా ప్ర‌యాణించే రైళ్ల‌ను ర‌ద్దు చేసి పారేయాల‌న్న‌ది మ‌రో ఆలోచ‌న‌.

అంటే.. ఏదైనా ట్రైన్ లో సామ‌ర్థ్యం కంటే త‌క్కువ‌గా ప్రయాణికులు ఉంటే.. ఆ రైలును ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి.. మ‌రో రూట్ లోకి మ‌ళ్లించ‌ట‌మ‌న్న మాట‌. అంటే.. ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సుల కంటే దారుణంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం అన్న మాట‌. ఇలాంటి పిచ్చ ఐడియాలు మ‌రికొన్నింటిని స‌ద‌రు క‌మిటీ రైల్వే బోర్డుకు అందించిన‌ట్లుగా తెలుస్తోంది. అదే నిజ‌మైతే.. ఇప్ప‌టికే రైల్వేల విష‌యంలో మోడీ స‌ర్కారు తీసుకొన్న పిచ్చ నిర్ణ‌యాల‌కు తాజా సూచ‌న‌లు పీక్స్ కు చేరుస్తాయ‌న‌టంలో సందేహం లేదని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News