ఇంట్లో టాయిలెట్ లేకుంటే అక్కడ అనర్హత వేటు

Update: 2016-03-31 04:30 GMT
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పొందాలంటే హర్యానాలో ఒక ఆసక్తికర నిబంధనను చేర్చారు. కనీస వయసు లాంటి అంశాలు మాత్రమే కాదు.. ఇంట్లో టాయిలెట్ ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న రూల్ ను తాజాగా చేర్చటం ఆసక్తికరంగా మారింది. కనీస విద్యార్హతతో పాటు.. మరుగుదొడ్డి ఉండేలా తాజాగా చట్టసవరణ చేశారు. హర్యానా పురపాలక సవరణ బిల్లు 2016 గురించి వింటే ఆసక్తికరంగా అనిపించటమే కాదు.. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతుంది.

తాజాగా చేసిన చట్టం ప్రకారం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పురుష అభ్యర్థులు కనీసం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు.. ఇంటి దగ్గర మరుగుదొడ్డి తప్పనిసరి. ఇక.. మహిళలు.. ఎస్సీ అభ్యర్థులైతే కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. ఇక.. ఎస్స మహిళలు అయితే ఐదో తరగతి పాస్ అయి ఉండాలి. ఇక.. అభ్యర్థులంతా తమ ఇంట్లో మరుగుదొడ్డి ఉందని స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఒకవేళ ఇంట్లో మరుగుదొడ్డి లేకుంటే.. ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేస్తారు.
Tags:    

Similar News