డ్రాగన్ దేశాన్ని దడ పుట్టిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’

Update: 2022-03-15 03:17 GMT
రెండున్నరేళ్ల ముందు ప్రపంచానికి కరోనా గురించి కనీస సమాచారం తెలీని వేళలోనే లాక్ డౌన్ ను విధించి.. కరోనాను కంట్రోల్ చేయటానికి డ్రాగన్ దేశం చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. నిత్యం కళకళలాడే వూహాన్ మహానగరం కరోనా దెబ్బకు ఎలా మారిందో అప్పట్లో చూసిన ప్రపంచానికి విషయం సరిగా అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి.. వూహాన్ మాదిరే యావత్ ప్రపంచం లాక్ డౌన్ గుప్పిట్లో బంధీగా మారటమే కాదు.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి లోకి జారిపోయింది. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వేళలో.. ఈ మహమ్మారి పుట్టింట్లో మాత్రం ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు.

కరోనా ఉప వేరియంట్ గా చెబుతున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ దెబ్బకు చైనా వణికిపోతోంది. బి.ఎ.2గా పిలిచే ఈ కొత్త వేరియంట్ దెబ్బకు చైనాలోని నగరాలకు నగరాలు లాక్ డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. నిర్మానుష్యమైన రోడ్లు.. ఎక్కడ చూసినా పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది హడావుడితో పాటు.. పాలకులు విధించిన లాక్ డౌన్ కారణంగా బయటకు వచ్చేందుకు చైనీయులు వణుకుతన్నారు.

ఈ కొత్త వేరియంట్ కారణంగా మరణాలు పెద్దగా చోటు చేసుకోవు కానీ.. వేగంగా విస్తరించే గుణం ఈ వేరియంట్ కు ఉందని చెబుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఈ వేరియంట్ భారీ స్థాయిలో చైనా మొత్తాన్ని చుట్టేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో చైనా వ్యాప్తంగా 1337 కేసులు వెలుగు చూస్తే.. ఒక్క జిలిన్ ప్రావిన్స్ లోనే 895 కేసులు వెలుగు చూశాయి.

 దీంతో.. చైనాలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేందుకు వీల్లేని రీతిలో ఆంక్షలు విధించటం గమనార్హం. చైనా రాజధాని బీజింగ్ లో ఆరు కేసులు వెలుగు చూడటంతో.. ఈ మహానగరంలోని చాలా భవనాల్ని మూసివేశారు. కరోనాను గుప్పిట్లో బంధించేసి.. దాని నుంచి ప్రజల్ని కాపాడేందుకు లాక్ డౌన్ మంత్రాన్ని ఇప్పటికి పఠిస్తున్న చైనా తీరును చూసినోళ్లంతా విస్మయానికి గురి అవుతున్నారు. ఎంత నొక్కి పెడితే.. అంతకంటే ఎక్కువ వేగంతో విరుచుకుపడే కరోనా సంగతి చూడాలంటే.. లాక్ డౌన్ కాలం చెల్లిన థియరీగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ విషయం కరోనా పుట్టింటికి తెలియకపోవటం ఏంటి?
Tags:    

Similar News