కేటీఆర్ కాన్వాయ్ లో కొత్త మార్పులు.. సీఎం కళ వచ్చేసింది

Update: 2020-01-08 04:35 GMT
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న కేసీఆర్.. తన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేస్తారంటూ కథనాలు రావటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటం ద్వారా..అద్భుతమైన స్టార్టింగ్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. గతంలో యూపీఏ సారథిగా వ్యవహరించిన సోనియా.. తన కుమారుడి విషయంలో చేసిన తప్పుల్ని.. కేసీఆర్ చేయకూడదన్న భావనను తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు మీడియాలో కథనాలు రావటం తెలిసిందే.

కొన్ని మీడియా సంస్థల నుంచి మాత్రమే వస్తున్న ఈ కథనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అన్నింటికి మించిన ఈ వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జరిపిన పర్యటన సందర్భంగా ఆయనకు ఏర్పాటు చేసిన కాన్వాయ్ మరింత బలపర్చేలా ఉందని చెబుతున్నారు.

సాధారణంగా ఎవరైనా మంత్రి జిల్లాల్లో పర్యటిస్తుంటే.. రోప్ పార్టీని ఏర్పాటు చేయటం.. కాన్వాయ్ లో అంబులెన్స్ ను ఉంచటం లాంటివి చేయరు. దీనికి భిన్నంగా సీఎం స్థాయి ఏర్పాట్లు కేటీఆర్ కాన్వాయ్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించటం గమనార్హం. వరంగల్ నిట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలంతా క్యూ కట్టటమే కాదు.. ఆయన పట్ల ప్రదర్శిస్తున్న గౌరవ మర్యాదల్లో తేడా వచ్చేసిందన్న మాట పలువురి నోట వినిపించింది.
Tags:    

Similar News