ఏంటీ ఉపద్రవం.. పిల్లలను కబళిస్తున్న కొత్త కరోనా

Update: 2022-01-13 07:51 GMT
ఇన్నాళ్లు పెద్దలను పట్టి పీడించిన కరోనా మహమ్మారి తాజాగా పిల్లలను కబళిస్తోంది. అమెరికా, యూరప్ లాంటి చోట్ల విస్తృతంగా వ్యాపించి చిన్నారులను ఆస్పత్రి పాలు చేసిన ఈ రోగం.. ఇప్పుడు భారత్ లోనూ అదే గతి పట్టిస్తోంది. ఒమిక్రాన్, డెల్టా ప్లస్ లాంటి కొత్త వేరియంట్లతో కరోనా పిల్లలకు పాకుతోంది.  ప్రస్తుతం పిల్లలపైనా కూడా కరోనా ప్రభావం చూపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. కరోనా బారినపడిన పిల్లలను గమనిస్తే డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒకటి.. రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడంతోపాటు వాంతులు, విరోచనాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ తో బాధ పడిన పిల్లల్లో కడుపునొప్పి, తలనొప్పి ఉండేది కాదని.. కానీ ప్రస్తుతం కరోనా బారినపడిన పిల్లల్లో కడుపునొప్పి తలనొప్పి విపరీతంగా ఉంటుందని చెబుతున్నారు.

కరోనా బారినపడిన పిల్లలు సహజంగా జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాకుండా కడుపునొప్పి, తలనొప్పి తో కూడా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

చిన్నారులలో ఏ మాత్రం ఈ లక్షణాలు కనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా పరీక్షలు చేయించి అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా కరోనా మూడోదశలో 5 సంవత్సరాలలోపు పిల్లల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఐదేళ్లలోపు పిల్లలకు మాస్కులు పెట్టినా వారు ఉంచుకోరని కిందకు లాగేసి ఉంటారని.. దీంతో వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. ఐదేళ్లలోపు వారికి టీకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి పిల్లల వార్డులో ఐదుగురు పిల్లలు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. అమెరికాలో 23 నుంచి 30శాతం పిల్లలు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు. ఇండియాలో కూడా పిల్లలు ఒమిక్రాన్ బారిన పడే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News