తెలంగాణలో వైరస్ కల్లోలం: టెస్టులు చేయడంలో అదే నిర్లక్ష్యం

Update: 2020-06-14 06:30 GMT
మొన్నటి దాకా వందకు పైగా.. తాజాగా 250కి చేరువగా కేసులు చేరాయి. దీంతో తెలంగాణలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీనికి కారణం టెస్టులు చేయకపోవడమేనని సర్వత్రా వినిపిస్తున్న మాట. ఈ విషయంలో హైకోర్టు కూడా తీవ్రంగా ఆక్షేపించింది. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం కలవరం రేపుతోంది. దీనివలన వైరస్ తీవ్రంగా వ్యాపించడానికి కారణమవుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ అనుమానం వచ్చిన వారందరికీ పరీక్షలు చేయలేమని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో ఎవరికీ వైరస్ ఉందో లేదో తెలియడం లేదు. అవసరం అనుకుని పరీక్షల కోసం వస్తున్న వారికి పరీక్షలు చేయకుండా నిరాకరిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పరీక్షలు చేసేందుకు ప్రైవేట్‌ ల్యాబ్‌ లకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే తిప్పి పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖులు - సంపన్నులు - కొందరు ప్రజాప్రతినిధులు‌ - నాయకులు అడిగిన వెంటనే పరీక్షలు చేస్తున్నారు. సామాన్య ప్రజలను పట్టించుకోవట్లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు టెస్టుల సంఖ్యతో పోలిస్తే తెలంగాణలో జరుగుతున్న టెస్టుల సంఖ్య చాలా తక్కువ. ఇదే విషయం చాలాసార్లు నిరూపితమైంది. ఈ విషయంలో కోర్టులు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అదే వైఖరిని ప్రదర్శిస్తోంది. ఐసీఎంఆర్‌ కూడా రాష్ట్రంలో వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ కాలేదని, ప్రమాదం లేదని తేల్చింది.

రాష్ట్రంలో ఆర్‌–నాట్‌ శాతం కూడా 180 నుంచి 110కి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. అవసరం అనుకున్న వారికి టెస్టులు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైరస్ సోకిన వారితో సహజీవనం చేయాల్సిన వారికి పరీక్షలు చేయాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. పరీక్షలు చేయాలంటూ రోజూ 2 వేల మందికి పైగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హైదరాబాద్‌ తోపాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పరీక్షలు చేసేందుకు తమకు అనుమతి లేదంటూ ప్రైవేట్‌ లో తిప్పి పంపితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టులు చేయమని తేల్చి చెబుతున్నారు.

సామాన్యులను పట్టించుకోకుండా సంపన్నులు - ప్రముఖులు - ప్రజాప్రతినిధులు - వారి కుటుంబసభ్యులకు వెంటనే పరీక్షలు చేస్తున్నారు.  రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయకపోయినా అవసరమైన వారికి చేయాలని కోరుతున్నారు. తమకు వైరస్‌ ఉందో లేదో తెలియకుండా జీవించడం కష్టంగా ఉందని అనుమానితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే పరీక్షలు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం చేయకపోతే ప్రైవేటు ల్యాబ్స్‌లో వైరస్ టెస్టులు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఐసీఎంఆర్‌ కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిల్లో టెస్టులకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇస్తే సమస్యలు వస్తాయని వాదిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం, వైరస్ సోకిన వారితో సహజీవనం చేసే పరిస్థితులు ఉన్నాయి. వారికి పరీక్షలు చేయకపోతే వారి వలన మరికొందరికి వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పరీక్షలు పెంచాలి లేకపోతే ప్రెవేట్ లోనైనా  పరీక్షలకు అనుమతులు ఇవ్వాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News