టాయిలెట్ పైప్ ద్వారా కరోనా వ్యాప్తి ..అయ్యా బాబోయ్!

Update: 2020-09-06 02:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తి .. రోజురోజుకి పెరిగిపోతుంది. కరోనా వ్యాప్తి మొదలైన మొదట్లో .. కొన్ని అంతస్థులు గల అపార్ట్ ‌మెంట్‌ లో ఏ ఒక్కరికి కరోనా సోకిన అపార్ట్ ‌మెంట్‌ వాసులందరికి స్వీయ నిర్బంధం విధించి అందరికి వైద్య పరీక్షలు చేశారు. అలా ఎందుకు చేసే వారంటే కరోనా సోకిన వ్యక్తి లిఫ్ట్‌ ద్వారా రాకపోకలు సాగించడం వల్ల, అదే లిఫ్ట్‌ లో రాకపోకలు సాగించే ఇతరులకు వచ్చే అవకాశం ఉందని లేదా కరోనా సోకినా వ్యక్తి తో చనువుగా ఉన్న ఇతరులకు కూడా కరోనా వచ్చే ఆస్కారం ఉందన్న కారణంగా నిర్బంధ వైద్య పరీక్షలు జరిపేవారు. చైనాలోని ఓ అపార్ట్‌ మెంట్‌ విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకింది.  గ్వాంజౌ నగరంలోని ఓ బహుళ అంతస్తుల అపార్ట్ ‌మెంట్‌ లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది.

ఆ నలుగురి  కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న ఇద్దరు దంపతులకు కరోనా‌ సోకింది. అయితే , ఒకరినొకరు కలసుకున్నది లేదు. కనీసం మొహం కూడా చూడలేదు. కరోనా సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్‌ లు కూడా 25, 27 అంతస్తుల్లో ఉంటున్న వద్ధ దంపతులు ఉపయోగించలేదు. పని మనుషుల ద్వారా వచ్చి ఉండవచ్చునుకుందామంటే ఆ రెండు అపార్ట్‌ మెంట్లలో పని మనుషులు కూడా లేరు. కనీసం కొన్ని నెలలుగా ఆ రెండు అంతస్తుల వారు బయటకు కూడా రాలేదు. కానీ , వారికీ కరోనా సోకింది. దీనితో వారికీ కరోనా ఎలా సోకిందో తెలియక వైద్యులు తల పట్టుకున్నారు. చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు కానీ , కనిపెట్టలేకపోయారు.

 ఈ రహస్యాన్ని ఛేదించాలనే కృతనిశ్చయంతో వైరస్‌ను గుర్తించే మైక్రో లెన్స్‌లను పట్టుకొని 15వ అంతస్తులోన్ని అన్ని గదులను శోధించారు. అందులోని మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లోని వాష్‌రూమ్‌ కమోడ్‌లో కరోనా వైరస్‌ ఎక్కువగా కనిపించింది. కమోడ్‌ నుంచి ఆపార్ట్‌మెంట్‌ వెలుపలి నుంచి వెళ్లే గ్యాస్‌ పైప్‌లైన్‌లోనూ కరోనా వైరస్‌ కనిపించింది. అదే పైప్‌ లైన్‌ వెంట వైద్య నిపుణులు పరిశీలిస్తూ పోగా, 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌ లో ఓ మోస్తారుగా, 25,27 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్ ‌లో అధిక మోతాదులో  కరోనా వైరస్‌ కనిపించింది. 15వ అంతస్తులో కరోనా సోకిన వ్యక్తుల నుంచి టాయ్‌ లెట్‌ గ్యాస్‌ పైప్‌ ద్వారా కరోనా వైరస్‌ 25, 27 అంతస్తుల్లోని దంపతులకు వైరస్‌ సోకినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. 16, 21 అంతస్తుల వద్ద గ్యాస్‌ పైప్‌ లో కూడా వైరస్‌ కనిపించినందున వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు.

కమోడ్‌ గ్యాస్‌ పైప్‌ నుంచి కరోనా వైరస్‌ ‘బయో ఎయిరోసోల్స్‌’ రూపంలో బయటకు వస్తుందని, గాలిలో వైరస్‌ 30 నిమిషాలపాటు జీవించి ఉంటుందని, టాయ్‌ లెట్స్‌ కు సరైన వెంటిలేషన్‌ ఉండి, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉన్నట్లయితే అర నిమిషంలో సగం వైరస్, నిమిషంలో పూర్తి వైరస్‌ బయటకు వెళ్లిపోతుందని నిపుణులు తెలిపారు . 15వ అంతస్తులోని కుటుంబ సభ్యులు కరోనా మొదటగా వెలుగులోకి వచ్చిన  ‘వుహాన్‌’ పట్టణం నుంచి కొంతకాలం క్రితమే వచ్చారట. అక్కడ వారు వైరస్‌ బారిన పడి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.


Tags:    

Similar News