ఇక‌, ఇంటింటికీ పోస్ట‌ర్.. ఇదీ వైసీపీ ఎన్నిక‌ల విధానం...!

Update: 2022-12-10 02:30 GMT
ఏపీలో రాజ‌కీయ కాక ప్రారంభ‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఒక అడుగు ముందే ఉన్న‌ వైసీపీ.. ఇప్ప‌టికే త‌న పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపుతోంది. గ‌త మూడున్న‌రేళ్ల పాల‌న‌లో తాము ప్ర‌జ‌ల‌కు `ఏమిచ్చాం.. ఏం చేశాం` అనే విష‌యాన్ని సోదాహ‌ర‌ణంగా రుజువులు, సాక్ష్యాల‌తో స‌హా వివ‌రిస్తోంది.

ఈ క్ర‌మంలోనే మంత్రులు.. సీఎం జ‌గ‌న్ బొమ్మ‌తో ఉన్న నాలుగు పేజీల పుస్త‌కాన్ని ల‌బ్ధిదారుల‌కు అందిస్తున్నారు. అందులో వారిపేరుతో పాటు ఫొటోల‌తో కూడిన స‌మాచారం ఉంది. 2019 నుంచి 2022 మార్చి వ‌ర‌కు ఆయా కుటుంబాల‌కు అందిన ల‌బ్ధిని ఒకే చోట చేర్చి.. మీరు ఇంత మొత్తంలో ప్ర‌భుత్వం నుంచి సాయం పొందారు.. సో.. మీరుమాకే ఓటేయాలి.. అనే చందంగా ఈ ప్ర‌చారం ముందుకు సాగుతోంది.

అయితే.. ఇప్పుడు ఈ వ్యూహం కూడా పూర్తిగా మారిపోయింది. ప్ర‌జ‌ల‌కు చెబుతున్నాం.. వారికి గుర్తు ఉంటుందో ఉండ‌దో.. అని భావించిన వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో స‌రికొత్త వ్యూహానికి తెర‌దీశారు.

అదేంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేతికి అందించిన ల‌బ్ధిదారుల వివ‌రాల‌తో కూడిన పుస్త‌కం తోపాటు..ఇక, నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ల‌బ్ధిదారులు..పొందిన ల‌బ్ధిని వివ‌రిస్తూ.. ఒక పోస్ట‌ర్‌ను వారి ఇంటి త‌లుపుపైనే అంటించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మం బాధ్య‌త‌ల‌ను వ‌లంటీర్ల‌కు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలోని కొన్ని ఇళ్ల‌కు ప్ర‌యోగాత్మ‌కంగా ఈ పోస్ట‌ర్ల‌ను అంటించారు. దీనిలో ల‌బ్ధిదారులైన మ‌హిళ‌ల పేర్లు, వారు అందుకున్న ప‌థ‌కాలు.. న‌గ‌దు... ఎప్పుడెప్పుడు ప్ర‌భుత్వం ఎంతెంత వారి ఖాతాల్లోకి జ‌మ చేసింది.. వంటి సంపూర్ణ వివ‌రాలు ఉన్నాయి.

వీటిని త‌లుపుల‌పై అంటించ‌డం ద్వారా.. తెల్లారిలేస్తే. వారికి వాటిని గుర్తు చేయ‌డం ద్వారా.. వైసీపీ పేరును నిత్యం ప్ర‌జ‌లు స్మ‌రించుకునేలా వ్యూహం రెడీ చేసింది. మ‌రి ఇది ఎన్నిక‌ల స్టంటేన‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News