కేసీఆర్ ను కార్నర్ చేస్తున్న తెలంగాణ ఆల్ పార్టీస్ లీడర్స్?

Update: 2021-08-09 04:06 GMT
ఇన్నాళ్లు తెలంగాణలో సీఎం కేసీఆర్ ది ఆడింది ఆట.. పాడింది పాట.. ప్రతిపక్ష కాంగ్రెస్ నీరుగారిపోయింది.. బీజేపీ బలం సరిపోవడం లేదు. దీంతో హనీమూన్ లా ఆయన పాలన సాగింది. ఏం చేసినా.. ఏం చేయకున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. కానీ తెలంగాణ రాజకీయం మారింది. అన్ని రాజకీయ పక్షాలు యాక్టివ్ అయ్యాయి. ఇక కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కొందరు మేధావులు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్ అయ్యారు. సో 2023 ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ అన్ని రాజకీయ పక్షాలుగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

కాంగ్రెస్ కు కొత్త బలం వచ్చింది.. రేవంత్ రెడ్డి రాకతో ఊపు వచ్చింది.. ఇప్పుడా పార్టీ బలంగా తయారవుతోంది. రేవంత్ రెడ్డి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. ఆయన దళితబంధు అంటే ఈయన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంటూ ముందుకొస్తున్నారు. నిరుద్యోగాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు.

ఇక తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల రాక తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఆమె ప్రధానంగా కేసీఆర్ ప్రధాన వైఫల్యం అయిన నిరుద్యోగం, ఉద్యోగాలపై పడింది. ప్రతి వారం దీక్షలు చేస్తూ వేడెక్కిస్తోంది. కేసీఆర్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇక తెలంగాణ బీజేపీకి దూకుడు నేర్పిన బండి సంజయ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టిన ఉద్యమకారుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను చేర్చుకొని ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నాడు. ఈటలతో వాడివేడి మాటలు మాట్లాడిస్తే హీటెక్కిస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా మరో కొత్త రాజకీయ పార్టీ కేసీఆర్ టార్గెట్ గానే బయటకొచ్చింది. గురుకులాల కార్యదర్శిగా పనిచేసి వాటి రూపు రేఖలు మార్చిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు దళితుల కోసం తెలంగాణలో ‘బీఎస్పీ’లో చేరి కొత్త రాజకీయ పార్టీగా మారుస్తున్నారు. ఈయన కూడా కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయం మొదలుపెట్టారు. నల్గొండలో నిర్వహించిన తొలి సభలోనే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ‘ప్రజలు కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ కు వెళతారా’ అని కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. బాహుజనులంతా పాలకులు అవుతారని.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వెళతారని.. ఎర్రకోటపైనా నీలి జెండా ఎగురవేస్తామని ప్రకటించారు.

ఇక వేరేకాదు.. ఇప్పటికే కేసీఆర్ను వ్యతిరేకించిన కోదండరాం.. సీపీఐ,సీపీఎం, టీడీపీ సహా అందరికీ కేసీఆర్ ఒక్కడే యముడిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఎవరి దారి వాళ్లదే అన్నట్టుగా విభిన్నంగా పోరాడుతున్నారు. ఒక్కో వర్గానికి ఒక్కొక్కరు చొప్పున విభజించబడి వివిధ ఏజెండాలతో ముందుకెళుతున్నారు.

ఇక కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా వైరం పెంచుకున్న విజయశాంతి, అరవింద్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, డీకే అరుణ, సీతక్క తదితరులు కూడా టీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేస్తూ విమర్శల వాన కురిపిస్తున్నారు. వీరందరి లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ను అధికారంలోంచి దించడం...

తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో వీళ్లంతా కలిసి ఓడించగలరా? కేసీఆర్ ను టచ్ చేయగలరా? ఓడించే సత్తా వీరికి ఉందా? అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే ఇన్నాళ్లు హనీమూన్ లా సాగిన తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అలా ఉండవనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News