వాట్సాప్‌లో ఫోటోలు ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయట !

Update: 2021-08-04 23:30 GMT
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్‌ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్‌ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ యాప్‌ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి మొబైల్ లో ఉంటుంది.  సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ యాప్ మరో కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం ఎవరికైనా ముఖ్యమైన ఫోటోలను పంపాల్సి వస్తే.. వాటిని అవతలి వారు ఒకసారి మాత్రమే చూసేలా పంపొచ్చు. మనం పంపిన ఫోటోలు, వీడియోలను అవతలి వారు చూసిన తర్వాత, మళ్లీ వాటిని ఓపెన్ చేయడం కుదరదు.

ఇందుకోసం 'వ్యూ వన్స్' ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ వ్యూ వన్స్ ఫీచర్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లన్నింటిలోనూ పనిచేస్తుంది. ఈ ఫీచర్ వల్ల మన ప్రైవసీ ఫోటోలను అవతలివారు ఒక్కసారి మాత్రమే చూడగలరు. దాంతో వినియోగదారుని ప్రైవసీకి ఎటువంటి ఆటంకం కలగదు. వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లలో ఫోటోలు, వీడియోల వల్ల స్టోరేజీ ఫుల్ అవుతుంది. ఆ ఫోటోలను మనం వెతికి డిలీట్ చేయాల్సి వస్తోంది. కానీ, ఈ ఫీచర్‌ను యాప్‌లో  సెట్ చేసుకోవడం వల్ల మనం ఒకసారి చూసిన తర్వాత ఫోటోలు కనిపించకుండా పోతాయి.

అలాగే మనం ఇతరులకు పంపే ఫోటోలు, వీడియోలు వారి లైబ్రరీలో స్టోర్ అయ్యే అవకాశం లేదు. అంతేకాకుండా వ్యూ వన్స్ ఫీచర్‌తో మనం పంపే సందేశాలు ఇతరులు ఫార్వడ్, సేవ్, స్టార్, షేర్ చేయలేరు. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించి పంపే ఫోటో, వీడియోలను 14 రోజుల్లోపు ఓపెన్ చేయకపోతే ఆ మీడియా చాట్‌ కనుమరుగవుతుంది. ఈ ఫీచర్‌ ను ఉపయోగించాలనుకునే వారు ఇతరులకు ఫోటోలు, వీడియోలు పంపే ముందు ప్రతిసారి తప్పనిసరిగా వ్యూ వన్స్ ఆప్షన్‌ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను యూజర్స్ తమకు నమ్మకమైన వారికి ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు ఉపయోగిస్తే మంచిదని వాట్సాప్ సూచించింది.
Tags:    

Similar News