కొత్త జిల్లాల‌తో జ‌గ‌న్‌కు కొత్త త‌ల‌నొప్పి...!

Update: 2022-01-29 01:30 GMT
ఏపీలో అధికార వైసీపీకి ప‌రిష‌త్‌ల త‌ల‌నొప్పి ప‌ట్టుకుంది. అదేంటి? అనుకుంటున్నారా?  గ‌త ఏడాది జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్ర‌భంజ‌నం క‌నిపించిన మాట వాస్త‌వ‌మే. దీంతో వైసీపీ నాయ‌కులే ప‌రిష‌త్ చైర్మ‌న్ లు అయ్యారు. దీంతో ఇంకేముంది.. అభివృద్ధి ప‌రుగులు పెడుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఉన్న త‌ల‌నొప్పులు కూడా తొలిగిపోతా య‌ని భావించారు. అదేస‌మ‌యంలో పార్టీలోనూ ఆనందం వెల్లివిరిసింది. జిల్లాల్లో అభివృద్ది జ‌రిగితే.. అది కూడా ప‌రిష‌త్ పేరిట జ‌రిగితే.. ఆ ఊపే వేర‌ప్పా.. అనే మాట వినిపించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిష‌త్‌లు కూడా కీల‌క పాత్ర పోషించ‌నున్నాయ‌నే కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే.. ఇప్పుడు ఇవే ప‌రిష‌త్‌ల‌లో త‌ల‌నొప్పులు తెర‌మీదికి వ‌చ్చాయి దీనికి కార‌ణం.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డ‌మో.. పార్టీలో విభేదాలో కాదు.. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌య‌మే! తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జిల్లాల‌ను వ్య‌వ‌స్థీక‌రించింది. ఇప్పుడున్న 13 జిల్లాల‌ను మ‌రో 13 జిల్లాలుగా విభ‌జించించి మొత్తం 26 జిల్లాల‌ను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. మ‌రో రెండు మాసాల్లోనే ఇక్క‌డ పాల‌న ప్రారంభిస్తామ‌ని తెలిపింది. అంటే.. ఉగాదినుంచి పాల‌న ఇక్క‌డ ప్రారంభం అవుతుంది. అయితే.. ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న ఎఫెక్ట్ అన్నికంటే.. ప‌రిష‌త్‌ల‌పైనే ప‌డ‌నుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం ఉన్న జిల్లాల‌కు జ‌రిగాయి.

అయితే.. ఇప్పుడు ఈ జిల్లాలు రెండు జిల్లాలుగా.. కొన్ని మూడు జిల్లాలుగా (తూర్పు, గుంటూరు వంటివి) ఏర్ప‌డ‌నున్నాయి. మ‌రి ఈ జిల్లాల్లో ఏర్పాటైన ప‌రిష‌త్‌ల మాటేంటి? అనేది ఇక్క‌డి జిల్లా ప‌రిష‌త్ నేత‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఒక జిల్లా ప్రాతిప‌దిక‌గా ఏర్ప‌డిన జిల్లా ప‌రిష‌త్‌.. ఇప్పుడు రెండుగా విడిపోయింది. పోనీ.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉందా?  లేదు. ఎందుకంటే.. గ‌త ఏడాదే ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌రో ఐదేళ్ల‌పాటు వీటికి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో జిల్లాల్లో ప‌రిష‌త్ పాల‌న ఎలా సాగుతుంది?  మండ‌లాల‌ను ఎలా అభివృద్ధి చేయాలి?  అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక క‌లెక్ట‌ర్ నేతృత్వంలో ప‌రిష‌త్‌లు మ‌నుగ‌డ సాగిస్తే.. ఇప్పుడు ఇద్ద‌రు క‌లెక్ట‌ర్లు తెర‌మీదికివ‌చ్చారు. ఇది అభివృద్దికి విఘాతం అనే మాట అంద‌రి నుంచి వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో త‌మ‌కు సంబంధం లేని పొరుగు జిల్లాల మండ‌లాల‌ను, రెవెన్యూ డివిజ‌న్ల‌ల‌ను త‌మ జిల్లాల్లో క‌లిపార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇది త‌మ‌కు రాజ‌కీయంగా, ఆర్థికంగా కూడా ఇబ్బందేన‌ని వారు చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News